అక్షరటుడే, వెబ్డెస్క్ : Excise Department | రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ద్వారా సర్కారుకు భారీగా ఆదాయం సమకూరుతోంది. ఒక్క అక్టోబరు నెలలోనే రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. తాజా గణాంకాల ప్రకారం.. ఎక్సైజ్ శాఖ (Excise Department) ప్రభుత్వ ఖజానాకు మొత్తం రూ.6,348 కోట్లను సమకూర్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త మద్యం పాలసీతో (Liquor Policy) భారీ ఆదాయం వచ్చింది. కొత్తగా ఇచ్చే లైసెన్సుల దరఖాస్తుల ఫీజులు, లైసెన్స్ ఫీజుల రూపంలోనే రూ.3,180 కోట్లకుపైగా ఆదాయం లభించినట్లు శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాలకు రెండేళ్ల కాలపరిమితి ముగియడంతో ప్రభుత్వం కొత్త లైసెన్సులు (New Licenses) జారీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది.
Excise Department | రెట్టింపు ఆదాయం..
ఈసారి దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచినా, 95,628 మంది పోటీపడడం విశేషం. దీంతో కేవలం దరఖాస్తుల విక్రయం ద్వారానే రూ.2,868.8 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. అదనంగా, లైసెన్స్ పొందిన వ్యాపారులు అడ్వాన్స్ రూపంలో రూ.313 కోట్లు చెల్లించారు. ఇక మరోవైపు, దసరా పండుగల సీజన్, జాతరలు, సెలవుల నేపథ్యంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. గత ఏడాది అక్టోబరులో రూ.2,987 కోట్ల ఆదాయం రాగా, ఈసారి అది రూ.3,168 కోట్లకు చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెట్టింపు స్థాయిలో ఆదాయం రావడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
