అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sunrisers Eastern Cape | SA20 లీగ్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఈ జట్టు, టోర్నీ చరిత్రలోనే మూడో టైటిల్‌ను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది.
ఇప్పటికే 2023, 2024 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్, ఈ గెలుపుతో SA20లో అత్యంత విజయవంతమైన జట్టుగా తన స్థానాన్ని మరింత బలపర్చుకుంది.ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ (Pretoria Capitals) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) ఒంటరి పోరాటం చేశాడు. 56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 పరుగులు చేసి సెంచరీ సాధించి జట్టును గౌరవప్రదమైన స్కోర్‌కి చేర్చాడు.
Sunrisers Eastern Cape | అదరగొట్టారు..
అతడికి బ్రైస్ పార్సన్స్ 30 పరుగులతో కొంత మద్దతు ఇచ్చాడు. అయితే మిగతా బ్యాటర్లు సన్‌రైజర్స్ బౌలర్ల ముందు నిలవలేకపోయారు. మార్కో జాన్సన్ (Marco Jansen) అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 10 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. లుతో సిపమ్లా, అన్రిచ్ నోర్జ్ చెరో వికెట్ తీసి ప్రిటోరియాను కట్టడి చేశారు. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే జానీ బెయిర్‌స్టో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. వెంటనే క్వింటన్ డికాక్ కూడా ఔటయ్యాడు. జోర్డాన్ హన్మన్, జేమ్స్ కోల్స్ కూడా విఫలమవడంతో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. ఈ దశలో మరోసారి ఫైనల్లో నిరాశ తప్పదా అనే భావన అభిమానుల్లో నెలకొంది.
అయితే ఆ తర్వాత మాథ్యూ బ్రెట్జ్కీ, కెప్టెన్ ట్రిస్టన్ స్టబ్స్ క్రీజులో నిలబడి మ్యాచ్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశారు. ఇద్దరూ అసాధారణమైన ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తూ ప్రిటోరియా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. బ్రెట్జ్కీ 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు ట్రిస్టన్ స్టబ్స్ 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ జోడీ మధ్య జరిగిన అద్భుత భాగస్వామ్యంతో సన్‌రైజర్స్ 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది.ఈ విజయంతో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ మూడోసారి SA20 ట్రోఫీని ఎత్తుకుని చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌ను స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించిన ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ (Kavya Maran) జట్టు గెలుపు ఖరారైన క్షణంలో ఆనందంతో ఎగిరి గంతేసిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఆమె మూడు గెలిచాం అంటూ సిగ్నల్ ఇవ్వడం కూడా ఆకట్టుకుంది.