అక్షరటుడే, వెబ్డెస్క్ : Mahalaya Amavasya | భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్యగా పేర్కొంటారు. దీనినే పితృ మోక్ష అమావాస్య అని కూడా అంటారు. ఇది పితృదేవతలకు (Ancestors) ప్రీతికరమైన రోజు.
అందుకే ఈ అమావాస్యను పితృ దేవతల ఋణం తీర్చుకోవడానికి చాలా విశిష్టమైనదిగా భావిస్తారు. పితృ దేవతలకు సద్గతులు కలిగి, కుటుంబం సుఖశాంతులతో ఉండేందుకు, వంశాభివృద్ధి కోసం మహాలయ అమావాస్య (Mahalaya Amavasya) రోజున దానధర్మాలు చేయాలని పెద్దలు సూచిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 21న (ఆదివారం) మహాలయ అమావాస్య వస్తోంది. ఈ సమయంలో ఆచరించాల్సిన విధి విధానాల గురించి సిరిసిల్ల జిల్లా గూడెంకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రుద్రమణి శివాచార్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మహాలయ అమావాస్య విశిష్టత..
సాధారణంగా ఏడాదిలో 12 అమావాస్యలు వస్తాయి. ఈ 12 అమావాస్యలూ పితృ దేవతారాధనకు శ్రేష్ఠమైనవే. వాస్తవానికి ప్రతి ఒక్కరూ గతించిన పితృ దేవతలకు అమావాస్య రోజున తర్పణం వదలాలి. ఇలా ప్రతి అమావాస్యకు తర్పణాలు వదలడం కుదరని వారికి శాస్త్రాలలో మినహాయింపు ఉంది. అలా కుదరనివారు భాద్రపద బహుళపక్షంలో వచ్చే మహాలయ అమావాస్య రోజున తర్పణం వదిలితే ఏడాది మొత్తం తర్పణాలు వదిలిన ఫలితం ఉంటుందంటారు పెద్దలు. మహాలయ అమావాస్యకు విశిష్టత ఉంది. మహాభారత (Maha Bharata) కాలంలో కర్ణుడు తన పితృదేవతలకు తర్పణాలు వదిలి, ఆకలి బాధలు తీర్చుకుని తిరిగి స్వర్గానికి చేరింది భాద్రపద మాసంలోని అమావాస్య రోజునే.. కర్ణుడు (Karna) పితృదేవతలను సంతృప్తి పరచడం వల్లే ఆయన ఆకలి బాధలు తీరాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే భాద్రపద మాసంలో (Bhadrapada Masam) వచ్చే అమావాస్యను పితృ మోక్ష అమావాస్య అని కూడా పిలుస్తారు. చనిపోయిన వ్యక్తి ఏ తిథిలో చనిపోయారో తెలియనివారు, ఆ తిథిన శ్రాద్ధ కర్మలు చేయలేని వారు ఈ మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధకర్మలు నిర్వర్తిస్తారు. ఇలా చేయడం వల్ల వారికి పితృ దేవతల ఆశీస్సులు లభిస్తాయి.
తప్పకుండా తీర్చుకోవాల్సిన రుణాలు..
గరుడ పురాణం (Garuda Puranam) ప్రకారం ప్రతి మనిషి తన జీవిత కాలంలో మూడు రుణాలను తప్పకుండా తీర్చుకోవాలి. అవేమిటంటే దేవ రుణం, ఋషి రుణం, పితృ రుణం. వీటిలో పితృరుణం తీర్చుకునే అవకాశం మనలో ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అంటే పితృ దేవతలకు భక్తి శ్రద్ధలతో శ్రాద్ధ కర్మలు నిర్వహించడం, అమావాస్య రోజు తర్పణాలు విడవడం, పితృ దేవతల పేరిట దానధర్మాలు చేయడం వంటి సత్కర్మలు ఆచరిస్తే పితృదేవతల రుణం తీరుతుందని గరుడ పురాణం చెబుతోంది. మహాలయ అమావాస్య రోజు ఆచరించే శ్రాద్ధ కర్మలు, తర్పణాలు వల్ల పితృ దేవతలకు శాంతి, సద్గతులు కలుగుతాయన్నది శాస్త్ర వచనం. గ్లాసులో నీళ్లు, నువ్వులు, పాలు, దర్బలు వేసి ఇంటి యజమాని దక్షిణం వైపునకు మళ్లి మూడు సార్లు బొటన వేలు, చూపుడు వేలు మధ్య నుంచి నీళ్లు వదలాలి. దీనినే తర్పణం అంటారు.
చేయాల్సిన దానాలు..
మహాలయ అమావాస్య చాలా శక్తిమంతమైనది. ఈ రోజు చేసే దానాలు విశేష ఫలితాలను ఇస్తాయని పెద్దలు చెబుతారు. ఈ రోజున బ్రాహ్మణులకు, జంగమ దేవరలకు గుమ్మడికాయ దానం చేయాలి. పితృ దోషాలు తొలగి సమస్త శుభాలు కలగాలంటే గుమ్మడి కాయతో పాటు వస్త్ర దానం (Vastra Danam) కూడా చేయాలి. అలాగే ఉప్పు, ఇనుము, పత్తి, బియ్యం కూడా దానమివ్వాలి. గోవులకు ఆహారం అందించాలి.