అక్షరటుడే, కోటగిరి: Illegal Mining | మొరం అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.. గుట్టలు కనిపిస్తే మాయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆదివారం వస్తే చాలు.. మొరం అక్రమ రవాణా (illegal transportation) దర్జాగా చేపడుతున్నారు. ప్రకృతి వనరులను కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. సండే సెలవు కావడంతో జోరుగా రవాణా సాగుతోంది. వేబిల్లుల ఊసే లేకుండా పగలురాత్రి ఇష్టారాజ్యంగా మొరాన్ని తరలించి అందినకాడికి దండుకుంటున్నారు.
పోతంగల్ మండలంలో మొరం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పగలు రాత్రి తేడా లేకుండా అక్రమార్కులు మొరం దందా చేస్తున్నారు. ముఖ్యంగా కిందిస్థాయి సిబ్బంది (lower-level staff) ప్రోద్బలంతో దర్జాగా ఈ రవాణా సాగుతోందని తెలుస్తోంది. ఈ రవాణా కారణంగా రోడ్లు ఛిద్రమవుతున్నప్పటికీ పట్టించుకోవట్లేదని గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Illegal Mining | పోతంగల్ మండలంలో..
మండలంలోని చేతన్నగర్ గ్రామంలో (Chetan Nagar village) ఆదివారం అధికారులకు సెలవు ఉంటుందనే సాకుతో బహిరంగంగానే మొరం తవ్వకాలు చేపట్టారు. ట్రాక్టర్లలో, టిప్పర్లలో మొరాన్ని ఇతర ప్రాంతాలకు తరలించారు. అయితే మొరం తరలింపుపై గ్రామస్తులు రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు స్పందించి గ్రామానికి వెళ్లి మొరం అక్రమ రవాణాను నిలిపివేశారు. కాగా అక్రమ మొరం దందాపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.