అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sundar Pichai | బిలియనీర్ క్లబ్‌లోకి సుందర్ పిచాయ్ అడుగుపెట్టారు. టెక్ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ (Alphabet) సీఈవో సుందర్ పిచాయ్ అరుదైన ఘనత సాధించారు. ఈ సంస్థ సీఈవోగా భారత సంతతి వ్యక్తి 10 ఏళ్లుగా కొనసాగుతున్నారు. తాజాగా సుందర్ బిలియనీర్స్ క్లబ్‌లో చేరారు. ఆయన ప్రస్తుత నికర సంపద 1.1 బిలియన్ డాలర్లను మించిపోయింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ (Billionaires Index) పేర్కొంది.
Sundar Pichai | అనూహ్యంగా పెరిగిన షేర్ వాల్యూ..
సుందర్ పిచాయ్ సీఈవోగా ఉన్న 2023 నుంచి ఆల్ఫాబెట్ (Alphabet) కంపెనీ షేర్లు మెరుగ్గా రాణిస్తున్నాయి. షేర్ల విలువ పెరగడంతో రెండేళ్లలో సంస్థ మార్కెట్ వాల్యూ మరో ట్రిలియన్ డాలర్లు పెరిగింది. ఫలితంగా రెండు ట్రిలియన్ డాలర్లు దాటింది.
గురువారం నాటి ట్రేడింగ్‌ను పరిశీలిస్తే.. ఆల్ఫాబెట్ షేర్లు ఒకేసారి 4.1శాతం మేర లాభంతో దూసుకుపోయాయి. ఈ క్రమంలోనే ఆ కంపెనీకి సీఈవోగా ఉన్న సుందర్ నికర సంపద 1.1 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ పేర్కొంది. ఇక ఫోర్బ్స్ బిలియనీర్స్ సూచీని పరిశీలిస్తే.. సుందర్ నికర సంపద 1.2 బిలియన్ డాలర్లుగా ఉంది.
Sundar Pichai | సాధారణ ఉద్యోగిగా అడుగు..
సుందర్ పిచాయ్ తమిళనాడులోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో 1993లో స్కాలర్షిప్ పొందారు. 2004లో గూగుల్‌లో ఓ సాధారణ ఉద్యోగిగా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్లారు. గూగుల్ క్రోమ్, గూగుల్ డ్రైవ్, ఆండ్రాయిడ్ వంటి ఆవిష్కరణలకు నాంది పలికారు.