అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pakistan | పాకిస్థాన్‌లోని పారా మిలిటరీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఆత్మహుతి దాడులు చేపట్టడంతో పాటు, కాల్పులు జరిపారు. దీంతో ఆరుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పాక్‌లోని పెషావర్ ఫ్రాంటియర్ కోర్ ప్రధాన కార్యాలయంపై (Paramilitary Headquarters) సోమవారం ఉదయం దాడి జరిగింది. రెండు శక్తివంతమైన పేలుళ్లు చోటు చేసుకున్నట్లు పాక్ మీడియా తెలిపింది. అనంతరం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు పాకిస్థాన్ కమాండర్లు (Pakistani Commanders) సహా ఆరుగురు చనిపోయారు. ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారు.
మొదట ఫ్రాంటియర్ కోర్ ప్రధాన కార్యాలయం గేట్ వద్ద పేలుడు చోటు చేసుకుంది. అనంతరం సమీపంలోని సైకిల్ స్టాండ్ వద్ద మరో పేలుడు సంభవించింది. సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. FC ప్రధాన కార్యాలయంపై దాడి జరిగిందని, తాము ప్రతిస్పందిస్తున్నామని పోలీసు అధికారి మియాన్ సయీద్ అహ్మద్ చెప్పినట్లు పాకిస్తాన్ (Pakistan) వార్తా సంస్థలు తెలిపాయి.
ఈ సంవత్సరం ప్రారంభంలో క్వెట్టాలోని పారామిలిటరీ ప్రధాన కార్యాలయం వెలుపల శక్తివంతమైన కారు బాంబు పేలుడు చోటు చేసుకుంది. సెప్టెంబర్ 3న, క్వెట్టాలో జరిగిన రాజకీయ ర్యాలీలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 11 మంది మరణించారు. కాగా ఈ దాడికి ఏ సంస్థ ఇంకా బాధ్యత వహించలేదు. అయితే గత కొంతకాలంగా పాక్ సైనికులే లక్ష్యంగా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (Balochistan Liberation Army) దాడులకు పాల్పడుతోంది. బీఎల్ఏ దాడుల్లో గతేడాది 782 మంది చనిపోయారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 430 మందికి పైగా భద్రతా సిబ్బంది మరణించారు.
