అక్షరటుడే, వెబ్డెస్క్ : Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద చర్చకు కారణమైన సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం(State Government) అధికారికంగా ఈ కేసును సీబీఐకి (కేంద్ర దర్యాప్తు సంస్థ) బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
శుక్రవారం నాడు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 2017 ఆగస్టులో కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో సుగాలి ప్రీతి(Sugali Preethi) మృతి కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి ఈ కేసు అనేక అనుమానాలు, ఆరోపణల మధ్య కొనసాగుతూ వచ్చింది. కేసులో న్యాయం జరగలేదనే విమర్శలు, బాధిత కుటుంబం ఆవేదన, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నిరసనలు వెలిసాయి.
Pawan Kalyan | పవన్ కల్యాణ్ హామీ..
ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడానికి ప్రేరణగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)గతంలో ఇచ్చిన హామీనే ప్రధాన కారణంగా తెలుస్తుంది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన పలు సందర్భాల్లో గొంతెత్తగా, ఈ కేసును CBIకి అప్పగిస్తామన్న హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని ప్రభుత్వం నెరవేర్చింది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను ఇకపై CBI అధికారికంగా చేపడుతుంది. సంబంధిత కేసు వివరాలు, ఆధారాలు, దర్యాప్తు సమాచారం, అన్ని డాక్యుమెంట్లు రాష్ట్ర పోలీసులు సీబీఐ(CBI)కి అప్పగించనున్నారు. కేసులో ఉన్న అనేక అనుమానాలను సీబీఐ తన ప్రత్యేక దర్యాప్తు నైపుణ్యంతో పరిష్కరించే అవకాశం ఉంది.
ఈ కేసు విషయంలో సుదీర్ఘకాలంగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబానికి ఇది ఆశాజనక మలుపు అని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఒక చిన్నారికి జరిగిన ఈ దారుణం చాలా మందిని కలిచి వేసింది. తప్పు చేసిన వాడు తప్పక శిక్షించబడాలని డిమాండ్స్ వినిపిస్తున్న నేపథ్యంలో కేసు సీబీఐకి CBI చేరడంతో త్వరలో నిందితులు ఎవరో బయటకి రావడం ఖాయం అంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం, న్యాయ పరిరక్షణకు నాంది కావాలని ప్రజలు ఆశిస్తున్నారు.