అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLA Sudarshan Reddy | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
అలాగే ఆరు గ్యారంటీల అమలు బాధ్యతలను సైతం ఆయనకు అప్పగించారు. కేబినెట్ హోదా కల్పించారు. అలాగే మంత్రి వర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. సెక్రటేరియట్లో మినిస్టర్లతో సమానంగా ఛాంబర్ కేటాయించడంతో పాటు అన్నీ ప్రభుత్వ శాఖాధిపతులతో సంక్షేమ పథకాల అమలుపై సలహాలు, సూచనలు ఇచ్చేలా అధికారాలు కల్పించారు.
అంతేకాకుండా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావును పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా నియమించింది. అయితే కాంగ్రెస్ నేత అజరుద్దీన్ (Azharuddin)కు మంత్రి పదవి కట్టబెట్టిన అధిష్టానం.. సీనియర్లను బుజ్జగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే అజార్దుద్దీన్ మంత్రి ప్రమాణం చేసిన కాసేపటికే ఇరువురు సీనియర్ ఎమ్మెల్యేలకు కీలక పదవులు అప్పగించింది. కాగా.. బోధన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) రాష్ట్రంలో కాంగ్రెస్‌లోకి అధికారం వచ్చిన నాటి నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సైతం కేబినెట్లో చోటు కోసం విశ్వప్రయత్నాలు చేశారు.
MLA Sudarshan Reddy | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి లేనట్టేనా..!
మంత్రి వర్గ విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District)కు మరోసారి నిరాశే మిగిలింది. జిల్లా నుంచి ఇద్దరు సీనియర్లు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నారు. మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ (Shabbir Ali) మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కాగా.. గతంలోనే రాష్ట్ర సర్కారు ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టింది. అయినప్పటికీ తనకు మంత్రి పదవి వస్తుందని షబ్బీర్ ఆశలు పెట్టుకున్నారు. అయితే అజారుద్దీన్‌కు పదవి దక్కడంతో షబ్బీర్‌కు నిరాశే మిగిలింది. ఇక సుదర్శన్ రెడ్డి సైతం మంత్రి పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒకానొక సమయంలో హోం శాఖ కేటాయిస్తారని కూడా ప్రచారం జరిగింది. కాగా.. తాజాగా ఆయనకు కేబినెట్ హోదాలో ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వడంతో మంత్రి పదవి చేజారింది. జిల్లా నుంచి గెలిచిన వారిలో బీసీ సామాజిక వర్గం నుంచి ఎవరూ లేకపోవడంతో ఇక మంత్రి ఉండకపోవచ్చనే తెలుస్తోంది.

