అక్షరటుడే, వెబ్‌డెస్క్ : YSRCP Digital Book | మాజీ మంత్రి విడదల రజినిపై, వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రారంభించిన డిజిటల్ బుక్ యాప్‌లో ఫిర్యాదు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం(Rao Subramanyam), ఈ ఫిర్యాదు చేశారు.
తాను గతంలో 2022లో చిలకలూరిపేటలో దాడికి గురయ్యానని, తన ఇల్లు, కారు, పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందని ఆరోపించారు. ఈ దాడికి మాజీ మంత్రి విడదల రజినే(Vidadala Rajini) కారణమని ఆరోపించారు.ఫిర్యాదు చేసినప్పుడు ఆయన ఫోటోలు, వివరాలు కూడా అప్‌లోడ్ చేసినట్టు చెప్పారు. దీనిపై స్పందించి న్యాయం జరిగితే, జగన్ చెప్పినట్టు కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
YSRCP Digital Book | చిక్కుల్లో రజినీ..
విశేషం ఏంటంటే, ఆయన ఫిర్యాదు చేసిన ఈ డిజిటల్ బుక్ యాప్‌ను ఇటీవలే విడదల రజినే తన ఇంటి వద్ద పార్టీ నేతలతో కలిసి ప్రారంభించారు.ఇప్పటికే మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan), కార్యకర్తలకు న్యాయం చేయడానికి ఈ డిజిటల్ బుక్ ఉపయోగపడుతుందన్నారు. అన్యాయం చేసిన వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత శిక్షిస్తామన్న హామీ ఇచ్చారు. అయితే, సొంత పార్టీ నేతపైనే డిజిటల్ బుక్ యాప్‌లో ఫిర్యాదు రావడం ఆశ్చర్యంగా మారింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజా ఫిర్యాదుపై విడదల రజిని ఎలా స్పందిస్తారో చూడాలి.
కొద్ది రోజుల క్రితం జగన్ వైఎస్సార్‌సీపీ కార్యకర్తల(YSRCP Leaders) కోసం ‘డిజిటల్ బుక్’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన విషయం తెలిసింద. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో దీనిని ఆవిష్కరించగా, ఇది కార్యకర్తలకు శ్రీరామ రక్షలా ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ‘రెడ్ బుక్’ గురించి గొప్పలు చెప్పుకుంటూ పోతున్న వారికి ‘డిజిటల్ బుక్'(Digital Book) శక్తిని చూపిస్తామంటూ ఆ రోజు ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్. రాబోయే రోజుల్లో డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో వారికి అర్థమవుతుందని.. కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఇందులో నమోదు చేసుకోవాలంటూ పలు సూచనలు కూడా చేశారు జగన్. తప్పులు చేసిన వారు రిటైర్ అయిన సరే, పట్టుకొని వచ్చి మరీ చట్టం ముందు ఉంచుతామని అన్నారు. మొత్తానికి వైసీపీ ప్రారంభించిన డిజిటల్ బుక్ యాప్‌లో సొంత పార్టీకి చెందిన రజనీపై ఫిర్యాదు నమోదు కావడం ఆసక్తికరంగా మారింది.