అక్షరటుడే, వెబ్‌డెస్క్: Non-Layout Plots | అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడిన సబ్ రిజిస్ట్రార్ల విషయంలో ఉన్నతాధికారులు మెతక వైఖరి అవలంభిస్తున్నారు. నాన్ లే అవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఇటీవల జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. కాగా.. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు ఇప్పటి వరకు బాధ్యులపై ఎలాంటి చర్య తీసుకోలేదు. కనీసం మెమో కూడా జారీ చేయకుండా చేతులు దులుపుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.
నిజామాబాద్ నగరంలోని రోటరీ నగర్ సమీపంలో గల 12 గుంటల వ్యవసాయ భూమికి ఇటీవల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి పెట్టారు. ఓ సర్వే నంబర్లో పట్టాదారుకు భూ భారతిలో 12 గుంటల భూమి ఉండగా.. కేవలం నాలా పత్రాల సాయంలో ఏడు ప్లాట్లుగా విభజించారు. 8585, 8586, 8578, 8579 నంబర్లతో కలిగిన డాక్యుమెంట్లను అక్టోబర్ 10న పూర్తి చేశారు. కాగా.. ఈ వ్యవహారంపై ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితమైంది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అధికారులే ఏమీ పట్టనట్లు వ్యవహరించడం గమనార్హం.
Non-Layout Plots | అంతా అతడి చేతుల్లోనే..!
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్లకు సంబంధించి నిజామాబాద్‌లోనే డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. కాగా.. మొత్తం పది కార్యాలయాలు ఉండగా, నిత్యం వందల కొద్ది డాక్యుమెంట్లు జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయకపోగా.. డీఐజీ కార్యాలయంలో ఉండే ఓ ఉద్యోగి పెత్తనం చలాయిస్తున్నట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా ఇదే కార్యాలయంలో పాతుకుపోయిన సదరు ఉద్యోగి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడే సబ్ రిజిస్ట్రార్లకు అండదండగా ఉంటున్నట్లు ప్రచారంలో ఉంది. రెండు జిల్లాల్లోని కార్యాలయాల్లో ఈయనకు పట్టు ఉండడంతో ఉన్నతాధికారులు సైతం ఇతగాడిపైనే ఆధారపడి పనిచేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ కారణంగానే అక్రమాలు జరిగినట్లు తెలిసినప్పటికీ, ఆధారాలతో సహా ఫిర్యాదులు అందినా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం.