అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CBI Trap | దేశంలో అవినీతి అధికారులకు కొదవ లేకుండా పోయింది. గల్లీ నుంచి ఢిల్లీ (Delhi) దాకా ఎక్కడా చూసినా లంచాల కోసం ప్రజలను వేధించే అధికారులు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. కొందరు అధికారులు లంచం ఇవ్వనిదే పనులు చేయడం లేదు. ప్రజల నుంచి డబ్బు తీసుకోవడం కూడా ఒక డ్యూటీగా భావిస్తున్నారు. సీబీఐ (CBI), ఏసీబీ (ACB) అధికారులు దాడులు చేపడుతున్నా.. లంచాలకు మరిగిన అధికారులు మాత్రం మారడం లేదు. తాజాగా ఓ సబ్ ఇన్స్పెక్టర్ రూ.40 వేల లంచం తీసుకుంటుండగా.. సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నార్త్ ఢిల్లీలో సబ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న వ్యక్తిని సీబీఐ అధికారులు (CBI Officers) అరెస్ట్ చేశారు. ఒక వ్యక్తిని అరెస్టు చేయనందుకు, ముందస్తు బెయిల్ పొందడానికి సహాయం చేసినందుకు ఎస్సై రూ. 50 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడి బంధువు సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆగస్టు 5న అతనిపై అధికారులు కేసు నమోదు చేశారు. అయితే సదరు ఎస్సై చర్చల అనంతరం లంచం మొత్తాన్ని రూ.40 వేలకు తగ్గించాడు. దీంతో రూ.40 వేల లంచం తీసుకుంటుండగా.. సీబీఐ అధికారులు వల పన్ని ఎస్సైని అరెస్ట్ చేశారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
కాగా.. సీబీఐ ఇటీవల రూ.10 లక్షల లంచం తీసుకుంటుండగా.. కస్టమ్స్ సూపరింటెండెంట్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ముంబైలోని (Mumbai) ఎయిర్ కార్గోలో పని చేస్తున్న సదరు అధికారి సరుకులకు క్లియరెన్స్ ఇవ్వడానికి కస్టమ్స్ హౌజ్ ఏజెంట్ అనే సంస్థ నుంచి రూ.10 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు అరెస్ట్ చేశారు.
CBI Trap | ఇటు ఏసీబీ.. అటు సీబీఐ..
దేశంలో అవినీతి అధికారుల ఆట కట్టించడానికి సీబీఐ, ఏసీబీ చర్యలు చేపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఇటీవల సీబీఐ దాడులు (CBI Raids) పెరిగాయి. పలువురు అధికారులను సీబీఐ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. మరోవైపు తెలంగాణలో సైతం ఏసీబీ దూకుడు పెంచింది. లంచాలు తీసుకునే అధికారులను వల పన్ని పట్టుకుంటుంది. ఆకస్మిక తనిఖీలతో లంచాలకు మరిగిన అధికారులకు చెమటలు పట్టిస్తోంది.
CBI Trap | లంచం ఇవ్వొద్దు
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల్లో తమ పనుల నిమిత్తం లంచం ఇవ్వొద్దని ఏసీబీ, సీబీఐ అధికారులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే.. 011-24367887, 9650394847 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి.