అక్షరటుడే, బాల్కొండ: Balkonda | విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని బాల్కొండ ఎంఈవో బట్టు రాజేశ్వర్ (Balkonda MEO Battu Rajeshwar) పేర్కొన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని బోర్గాం (పి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు జిల్లాస్థాయి ఉపన్యాస, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు.
ఈ పోటీల్లో బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. క్విజ్ పోటీలో (quiz competition) పదో తరగతి విద్యార్థిని పి.సంజన జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి సాధించగా, అదే పాఠశాల విద్యార్థిని సాయి శివాని ఉపన్యాస పోటీలో (speech competition) ‘బాలవక్త’గా ఎంపికైంది.
ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఈఓ రాజేశ్వర్ విద్యార్థినులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు, గైడ్ టీచర్లు వేల్పూర్ శ్రీనివాస్, కవితా రాణి తదితరులు పాల్గొన్నారు.
