అక్షరటుడే, ఇందూరు: Deworming pills | జిల్లాలోని ప్రతి విద్యార్థికి నులిపురుగుల నివారణ మాత్రలను అందజేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. కలెక్టరేట్లో డీవార్మింగ్ డే (Deworming Day) కార్యక్రమంపై సోమవారం టాస్క్ఫోర్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 19 ఏళ్ల వయసు లోపు విద్యార్థులందరికీ మాత్రలు వేయాలన్నారు. ప్రధానంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు (Private Schools), కళాశాలలు, మదర్సాలు, అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థులకు, బడిబయట పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు (Albendazole tablets) వేయాలని చెప్పారు. ప్రతి పాఠశాలలో కళాశాలలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. భోజనం తిన్న తర్వాత ఈ మాత్ర వేయాలన్నారు. ప్రధానంగా రక్తహీనత, బరువు తగ్గుదల తదితర వ్యాధుల నుంచి కాపాడడానికి మాత్ర దోహదపడుతుందని పేర్కొన్నారు.
Deworming pills | మైకుల ద్వారా ప్రచారం చేయాలి
గ్రామాల్లో మైకుల ద్వారా.. పట్టణాల్లో చెత్త సేకరణ వాహనాల ద్వారా ప్రచారం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈనెల 9, 10వ తేదీల్లో రెండు రోజులపాటు తప్పనిసరిగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనాధ బాలల ఆశ్రమాలు, బాలల సంరక్షణ కేంద్రాలు (Childcare centers), రెస్క్యూ హోంలలో (Rescue Home) కూడా డీవార్మింగ్ డేను నిర్వహించాలని సూచించారు.
11వ తేదీన మాత్రలు ప్రతి విద్యార్థికి వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా విద్యార్థులకు అందకపోతే మలివిడతగా 18వ తేదీన వేయించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 19 ఏళ్లలోపు వయసు కలిగిన వారు సుమారు 4.05 లక్షల మంది ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్వో రాజశ్రీ, అదనపు కలెక్టర్ అంకిత్, డీపీవో శ్రీనివాసరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్ అశోక్, డీడబ్ల్యూవో రసూల్ బీ తదితరులు పాల్గొన్నారు.