అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad City | క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన స్టూడెంట్స్ పరస్పరం దాడికి దిగారు. కేవలం స్నానం చేయడానికి వేడి నీళ్ల కోసం పోటీ పడి తలలు పగులకొట్టుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో చోటు చేసుకుంది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ పాఠశాల (SR School)లో విద్యార్థులు ఘర్షణకు దిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాత శాంకరీ భవనంలో కొనసాగుతున్న ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో గురువారం ఉదయం ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ విద్యార్థి స్నానం చేసేందుకు వేడి నీళ్ల (Hot Water) కోసం వెళ్లగా.. అక్కడే ఉన్న మరో విద్యార్థితో గొడవ జరిగింది. ఈ గొడవ కాస్త ఘర్షణ వరకు దారి తీసింది. ఈ క్రమంలో ఓ విద్యార్థి తలకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది విద్యార్థిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు సమాచారం.
కాగా ఈ విషయమై బాధిత విద్యార్థి కుటుంబీకులు నాలుగో టౌన్ పోలీసు (4th Town Police)లకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ స్థాయిలో ఘర్షణ జరిగేంత వరకు సదరు పాఠశాల సిబ్బంది ఏం చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ విషయం బయటకు పొక్కకుండా ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాల యాజమాన్యం ప్రయత్నాలు చేయడం గమనార్హం.