Homeఆంధప్రదేశ్NTR District | అయ్యప్ప మాలతో పాఠశాలకు వచ్చిన విద్యార్థి.. అనుమ‌తించ‌క‌పోవ‌డంతో స్కూల్ ముందు ఆందోళ‌న‌

NTR District | అయ్యప్ప మాలతో పాఠశాలకు వచ్చిన విద్యార్థి.. అనుమ‌తించ‌క‌పోవ‌డంతో స్కూల్ ముందు ఆందోళ‌న‌

అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వచ్చిన విద్యార్థిని యాజమాన్యం లోపలికి అనుమతించకపోవడంతో గొల్లపూడిలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడి జీఐజీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చోటుచేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: NTR District | ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలోని  జీఐజీ ఇంటర్నేషనల్‌ పాఠశాల (GIG International School)లో ఓ వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వచ్చిన ఐదో తరగతి విద్యార్థిని యాజమాన్యం తరగతి గదిలోకి అనుమతించకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే స‌ద‌రు విద్యార్థి అయ్యప్ప దీక్ష (Ayyappa Deeksha) భాగంగా మాల ధరించి శుక్రవారం ఉదయం స్కూలుకు వచ్చాడు. అయితే, పాఠశాల యాజమాన్యం మాల కారణంగా అతన్ని లోపలికి అనుమతించకుండా ఇంటికి పంపించింది. ఈ విషయం తెలిసిన అయ్యప్ప మాలధారులు, ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.

NTR District | డీఈఓ సీరియస్

వారు “మాల ధరించిన విద్యార్థిని పాఠశాలలోకి ఎందుకు అనుమతించడం లేదని” ప్రశ్నించారు. ఈ వివాదం పెద్దదిగా మారడంతో స్థానికులు భవానీపురం పోలీసు (Bhawanipuram Police)లకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువురిని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఉద్రిక్తత కొనసాగింది.తర్వాత అయ్యప్ప భక్తులు ఈ విషయాన్ని డీఈవో యు.వి. సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన పాఠశాల యాజమాన్యం (School Management)తో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. యాజమాన్యం క్షమాపణ చెప్పి, ఆ విద్యార్థిని పాఠశాలకు అనుమతిస్తామని హామీ ఇచ్చింది.

ఇక, ఇటీవలి కాలంలో విద్యాధరపురంలోని బెజవాడ రాజారావు హైస్కూల్‌లో కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అయితే జీఐజీ ఇంటర్నేషనల్‌ పాఠశాల యాజమాన్యానికి డీఈవో సుబ్బారావు  నోటీసులు జారీ చేశారు. విద్యార్థిని తరగతి గదిలోకి అనుమతించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.అలాగే జిల్లాలోని అన్ని ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలలు అయ్యప్ప మాల ధరించి వచ్చే విద్యార్థులకు అభ్యంతరం లేకుండా తరగతుల్లోకి అనుమతించాలని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పాఠశాల గుర్తింపును రద్దు చేస్తామని డీఈవో హెచ్చరించారు.

Must Read
Related News