అక్షరటుడే, బోధన్/వర్ని : Chandur | బోధన్ (Bodhan) నియోజకవర్గంలోని చందూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో (Minority Gurukul School) విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చందూరు మండల పోలీసులు (Chandur Police) తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మైనారిటీ గురుకులంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆదివారం రాత్రి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Chandur | తెలియని కారణాలు..
అయితే విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. చదువులో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక మరేమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. వారి కుమారుడి మృతి పట్ల పూర్తిస్థాయి విచారణ జరిపించాలని అసలు కారణాలు బయట పెట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రి (District General Hospital)కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.
