అక్షరటుడే, ఇందూరు : AITUC | హక్కులు సాధించాలంటే పోరాటాలు ఒకటే మార్గమని సీపీఐ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఏఐటీయూసీ 2వ రాష్ట్ర మహాసభలు జిల్లా కేంద్రంలోని ఉమామహేశ్వర హాల్లో శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోరాటాల వల్లే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. హమాలీలకు సమగ్ర చట్టం రావాలన్నారు. కమ్యూనిస్టు పార్టీలతోనే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) ఎర్రజెండా సత్తా చాటాలన్నారు. కమ్యూనిస్టులు భారతంలో కృష్ణుడు లాంటి వారని, తాము ఏ వైపు ఉంటే ఆ వైపు బలం ఉంటుందన్నారు. ఎలాంటి స్వార్థం లేని సిద్ధాంతాలు గల పార్టీ సీపీఐ అని గుర్తు చేశారు. కమ్యూనిస్టులు చేసే పోరాటం రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా చేస్తున్నారని, బీజేపీ చేస్తున్న అన్యాయాలను బయటకు తీసుకొస్తున్నారన్నారు. రాష్ట్రంలో కూలీ రేట్లు ఒకే విధంగా ఉండాలని, కార్మికుల వయసు 58 నుంచి 65 వరకు పెంచాలని, ప్రభుత్వం పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలన్నారు.
బీజేపీది అత్యంత ప్రమాదకరమైన సిద్ధాంతమని, మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తుందని, కార్మిక కర్షకుల శ్రమను దోపిడీ చేసి బడా నాయకులకు దోచిపెడుతుందని ఎమ్మెల్యే సాంబశివరావు ఆరోపించారు. రాజ్యాంగాన్ని విచ్చిన్నం చేయాలని బీజేపీ చూస్తోందన్నారు. ఏ దేశంలోకి వెళ్లినా ఏ ఖండంలోకి వెళ్లినా ఎర్రజెండా ఉంటుందన్నారు.
AITUC | కార్మికులకు అండగా కాంగ్రెస్..
కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వమని కార్మికులకు అండగా ఉంటుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) అన్నారు. పదేళ్లుగా మార్కెట్ యార్డు ఉందా లేదా అనే సందేహం కలిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏర్పడిన తర్వాత రైతుబిడ్డను కమిటీ ఛైర్మన్గా నియమించామని ప్రస్తుతం కళకళలాడుతుందని తెలిపారు. మార్కెట్ యార్డులోని 170 మంది కార్మికులకు ఇళ్లు లేవని, తన దృష్టికి వచ్చిందని వారందరికీ ఇల్లు వచ్చేలా చర్యలు తీసుకుంటానన్నారు. అలాగే కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా చూస్తానన్నారు. సీపీఐ మిత్రపక్ష పార్టీ అని తప్పకుండా కార్మికులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అనంతరం సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్రాజ్ మాట్లాడుతూ.. శ్రమను ధార పోసి సంపదని సృష్టించేది కార్మికులని, వారికి చట్టబద్ధమైన హక్కులు కల్పించాలన్నారు. పీఎఫ్ అమలు చేయాలని వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పనిలో ప్రమాదాలు జరుగుతున్నాయని వారికి ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ యార్డు, హమాలీ, దడ్వాయి, చాట, స్వీపర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రద్ధానంద్ గంజ్ హమాలీ భవనం నుంచి శివాజీ చౌక్, రైల్వే గేట్ మీదుగా ఉమామహేశ్వర హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్పగంగారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, సీపీఐ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ, సహాయ కార్యదర్శి ప్రవీణ్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూమయ్య, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, ఆయా యూనియన్ల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.