అక్షరటుడే, ఇందూరు: CLC | ఐదు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు ప్రత్యేక తెలంగాణలో (telangana) పౌర హక్కుల కోసం సీఎస్‌సీ బలమైన పోరాటం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఎన్ నారాయణరావు అన్నారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం సీఎల్‌సీ (పౌరహక్కుల సంఘం) (Civil Rights Association) ఉమ్మడి జిల్లా 17వ మహాసభ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు జీవించే హక్కు కోసం తమ సంఘం సుదీర్ఘకాలంగా పనిచేస్తుందని వివరించారు. ఈ క్రమంలో తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొందన్నారు. అయినా.. ప్రజలతో కలిసి హక్కుల ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. కశ్మీర్ మొదలు కన్యాకుమారి (Kashmir to Kanyakumari) వరకు, మణిపూర్ నుంచి గుజరాత్ వరకు అన్ని ప్రాంతాల్లో హక్కుల ఉల్లంఘన, మారణ హోమానికి వ్యతిరేకంగా పని చేస్తున్నామన్నారు.
హైకోర్టు న్యాయవాది, సీఎల్సీ రాష్ట్ర నాయకుడు వి రఘునాథ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం రాజ్యాంగం కల్పించిన హక్కులకు జవాబుదారీగా ఉండి అమలు చేయాల్సిన నైతికత ప్రభుత్వాలపై ఉందన్నారు. కానీ ఇందిరాగాంధీ మొదలు నరేంద్ర మోదీ (Indira Gandhi to Narendra Modi) వరకు ప్రాథమిక హక్కుల అణచివేత కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక, కర్షక పోరాటాలకు, కనీస భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రశ్నించడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా ప్రగతిశీల శక్తులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు గొంతు విప్పాలన్నారు. సీఎల్‌సీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టి మాట్లాడారు.
కార్యక్రమంలో జిల్లా నాయకులు జలంధర్, బీక్ సింగ్, భాస్కరస్వామి, విజయరామరాజు, ప్రవీణ్, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు వెంకన్న, కె.గంగాధర్, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు నర్రా రామారావు, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి దాసు, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.గోదావరి, కె.సంధ్యారాణి, వివిధ ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.