అక్షరటుడే, నిజామాబాద్: Strong Winds Heavy Rain : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సాయంత్రం వరకు మాములుగా ఉన్న వాతావరణం రాత్రి కాగానే ఒక్కసారిగా మారిపోయింది. పగటిపూట ఎండ వేడితో ఇబ్బంది పడ్డ ప్రజలు రాత్రి గాలివాన దాటికి అతలాకుతలమయ్యారు. ఆకాశం మేఘావృతమైంది. ఇంతలోనే బలమైన ఈదురుగాలులు వీచాయి. బలమైన గాలికి భారీ వర్షం తోడైంది. ఇంతలోనే కరెంటు పోవడంతో సుమారు నగరమంతటా అంధకారం నెలకొంది.
గాలివాన దాటికి ఎక్కడ చూసినా విరిగిపడిన చెట్లే కనిపిస్తున్నాయి. రహదారులపై చెట్ల కొమ్మలు విరిగిపడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల నిలిపిఉంచిన వాహనాలపై కొమ్మలు విరిగిపడటంతో అవి ధ్వంసమయ్యాయి.

నిజామాబాద్ జిల్లాపై తుపాను లాంటి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం విరుచుకుపడింది. బలమైన గాలులకు తోడు భారీ వర్షం కురవడంతో జన జీవనం స్తంభించిపోయింది. నేలకొరిగిన స్తంభాలతో విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. దీంతో నగరంతో పాటు జిల్లాలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి నుంచి విద్యుత్ సిబ్బంది కరెంట్ సరఫరాను పునరుద్ధరించడానికి చర్యలు చేపడుతున్నారు.
నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో ఓ ఇంటిపై స్తంభం విరిగిపడింది. మరికొన్ని చోట్ల రోడ్లపై స్తంభాలు పడిపోయాయి. నగరంలో చెట్టుకొమ్మ మీద పడడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.



Strong Winds Heavy Rain : మెండోరాలో అత్యధిక వర్షపాతం
మెండోరాలో అత్యధికంగా సరాసరి 4.5 సెం.మీ. వర్షం కురిసింది. ఆర్మూర్‌లోని ఇస్సాపల్లిలో 3.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

నగరంలోని రైల్వేస్టేషన్ మార్గంలోని గీతాభవన్ వద్ద గోడపై పడ్డ చెట్టు

నగరంలోని ఎల్వీఆర్ షాపింగ్ మాల్ నుంచి దేవి రోడ్‌కు వెళ్లే దారిలో రోడ్డుపై చెట్టు






