అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ursula von der Leyen | భారతదేశం బలోపేతంగా ఎదిగితే ప్రపంచం మరింత స్థిరత్వం, సమృద్ధి చెందుతుందని యూరోపియన్ యూనియన్ (ఈయూ) కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ అభిప్రాయపడ్డారు. భారత్ విజయం అందరికీ లాభదాయకమని పేర్కొన్నారు.
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించబడడం తనకు జీవితాంతం గుర్తుండిపోయే గౌరవమని ఉర్సులా భావోద్వేగంగా తెలిపారు. న్యూ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.
“బలమైన, విజయవంతమైన భారతదేశం ప్రపంచాన్ని ఎక్కువ స్థిరత్వం కలిగినదిగా, సంపదతో నిండినదిగా, మరింత సురక్షితమైనదిగా మలుస్తుంది. ఈ ప్రయోజనం ప్రతి ఒక్కరికీ చేరుతుంది” అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
Ursula von der Leyen | వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరు
ఈ ఏడాది యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో పాటు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈయూ అత్యున్నత నాయకులు భారత రిపబ్లిక్ డే వేడుకల్లో ఇలా పాల్గొనడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
Ursula von der Leyen | మోదీతో ఉన్నతస్థాయి చర్చలు
ఈయూ ప్రతినిధి బృందం మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఉన్నతస్థాయి చర్చలు నిర్వహించనుంది. భారత్-ఈయూ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వ్యాపార ఒప్పందం (FTA) దిశగా రెండు వర్గాలూ దృఢంగా అడుగులు వేస్తున్నాయని ఇటీవలే జరిగిన డావోస్ ప్రపంచ ఆర్థిక వేదికలో ఉర్సులా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం కోట్లాది మంది ప్రజలకు ఉపయోగకరంగా మారుతుందని.. ప్రపంచ జీడీపీలో దాదాపు 25 శాతం వాటాను కలిగి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
The display of the flags of the EU, the EU Military Staff, and our maritime missions ATALANTA and ASPIDES at India’s Republic Day is a powerful symbol of our deepening security cooperation.
It will culminate tomorrow in the signature of our Security and Defence Partnership. pic.twitter.com/l5pPxFt8Rv
— Ursula von der Leyen (@vonderleyen) January 26, 2026