అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Ponguleti | ప్రభుత్వ భూముల రక్షణకు కఠిన చర్యలు చేపడుతామని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. అధికారులు సమన్వయంతో భూముల రక్షణకు కృషి చేయాలని ఆదేశించారు.
మంత్రి అజారుద్దీన్ (Minister Azharuddin), జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ (Jubilee Hills constituency) సమస్యలపై మంత్రి సోమవారం సమీక్షించారు. బోరబండ, ఎర్రగడ్డ, షేక్పేటలలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న శ్మశానవాటికల అవసరాలను తీర్చాలని సూచించారు. అలాగే ఆక్రమణలపై చట్ట ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, రక్షణ, వక్ఫ్ బోర్డు అధికారులను (Waqf Board officials) ఆదేశించారు.
Minister Ponguleti | ప్రజల ఆస్తి
ప్రభుత్వ భూములు (government lands) ప్రజల ఆస్తి అని మంత్రి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు చర్చించారు. మైనార్టీలు శ్మశాన వాటికలు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ సమస్యను వీలైనంత వేగంగా రక్షణశాఖ, రెవెన్యూ, వక్ఫ్‌బోర్డ్ సమన్వయంతో అధిగమించాలని మంత్రి సూచించారు. అవసరమైన చోట రెవెన్యూ భూమిని రక్షణశాఖకు బదలాయించి వారి నుంచి ప్రత్యామ్నాయంగా భూమి తీసుకోవాలన్నారు.
ప్రజా అవసరాలు, అభివృద్ది కార్యక్రమాల కోసం వినియోగించాల్సిన ప్రభుత్వ భూములను కొద్దిమంది కబ్జా చేయడానికి ఆక్రమిస్తారని పొంగులేటి పేర్కొన్నారు. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఆక్రమణలను గుర్తించిన వెంటనే నోటీసులు జారీ చేసి ఆధీనంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివాదాల్లో ఉన్న భూముల పరిరక్షణకు న్యాయపరంగా ముందుకు వెళ్లాలని సూచించారు.