అక్షర టుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | ప్రజలు, యువతలో డ్రగ్స్ వ్యసన నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని కేంద్ర కారాగార శాఖ ప్రధాన అధికారి సౌమ్య మిశ్రా (Soumya Mishra) అన్నారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ కారాగార శాఖ (Telangana Prison Department) చేపట్టిన పునరావాస కార్యక్రమాల్లో భాగంగా 3 ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించారు.
31వ బిపిసిఎల్ అవుట్ లెట్, మూడో అపీ కల్చర్, నాలుగో నివృత్తి డి అడిక్షన్ సెంటర్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డి అడిక్షన్ సెంటర్(De-Addiction Center)కు నివృత్తి అనే పేరును ఎన్జీవోలతో సంప్రదించి పెట్టామన్నారు. దీని అర్థం విముక్తి..శాంతి.. కొత్త జీవితం అని ఆమె వివరించారు. ఎవరు జైలులో ఎప్పటికీ ఉండాలని కోరుకోరని ఖైదీలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. మీరు మారండి, చెడు అలవాట్లను విడిచిపెట్టండి, కుటుంబాలతో సంతోషంగా జీవించండి, ‘‘మీ మార్పు మీకే కాదు మీ కుటుంబానికి సమాజానికి ఎంతో గర్వ కారణం” అన్నారు.
తేనెటీగల పెంపకం, ఫ్యూయల్ ఔట్ లెట్లు ఖైదీలు విడుదల తర్వాత కూడా కొనసాగించేలాగా ఉపాధి అవకాశాలను శాఖ తరపున అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా శాఖ ఐజీ మురళి బాబు (District IG Murali Babu), డీఐజీ సంపత్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya), ప్రకృతి ఎన్జీవో కల్పన, సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఆనందరావు, శ్రవణ్ కుమార్, వెంకట కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

