అక్షరటుడే, కామారెడ్డి: Local Body Elelctions | ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. దోమకొండ మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్(Postal ballot) కౌంటర్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేల ఏర్పాట్లు చేయడం జరిగిందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా మొత్తం 2,361ఫారం 14 పత్రాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 152 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు స్వీకరించామన్నారు. మొదటి దశలో మొత్తం 10 మండలాలలో 1,714 ఫామ్–14 అప్లికేషన్లు పంపిణీ చేశామన్నారు. రెండవ విడత జరిగే 7 మండలాలలో 322, మూడవ విడతలో జరిగే 8 మండలాలలో 325 ఫామ్–14 అప్లికేషన్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
నియమావళిని ప్రతి అధికారి పాటించాలి
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి అధికారి ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటర్ పరిశీలన అనంతరం ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రతి అధికారి తన బాధ్యతను నిబద్దతతో నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎలాంటి లోపాలకు తావివ్వకుండా పోలింగ్ కేంద్రాలలో మెటీరియల్ అందుబాటులో ఉన్నాయా లేదా అనేది నిర్దారించుకోవాలని సూచించారు.
మొదటి విడత పోలింగ్ ఈనెల 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని, అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఒకరోజు ముందుగానే ఉదయం డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు చేరుకుని తమకు కేటాయించిన కేంద్రాలకు మెటీరియల్ తీసుకెళ్లాలని సూచించారు. ఓటింగ్ విషయంలో గోప్యత పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, శిక్షణ నిర్వాహకులు నర్సింలు, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.