అక్షరటుడే, కామారెడ్డి: Vinayaka Chavithi | ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గణేష్ నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో (SP Rajesh Chandra) కలిసి మంగళవారం ఆయన గణేష్ నిమజ్జనం నిర్వహించనున్న టేక్రియాల్ చెరువును పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కామారెడ్డి (Kamareddy) పట్టణాన్ని అనుకొని ఉన్న టేక్రియాల్ చెరువులో (Tekriyal Cheruvu) గణేష్ నిమజ్జనం సందర్భంగా దాదాపు 700లకు పైగా గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉందన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చెరువు వద్ద ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. చెరువులోకి ఎవరు పడితే వారు వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
వినాయకులను నిమజ్జనం చేయడానికి పెద్ద క్రేన్, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. వాటర్ ప్రూఫ్ షామియానా ఏర్పాటుచేసి రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, ఫిషరీస్, ఫైర్ తదితర శాఖలతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వినాయకులకు తగలకుండా విద్యుత్ వైర్ల ఎత్తును పెంచాలని, విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
చెరువుకు వచ్చే రహదారికి మరమ్మతు చేసి సిద్ధం చేయాలన్నారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో అధిక సంఖ్యలో వినాయకులు వస్తాయని, పకడ్బందీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి వరుస క్రమంలో వినాయకులను నీళ్లలో వేసేలా పర్యవేక్షించాలని సూచించారు.
కామారెడ్డి ఆర్డీవో, తహశీల్దార్, పోలీస్, ఇతర శాఖల అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం టేక్రియాల్‌లో వినాయకులు వచ్చే రహదారిని పరిశీలించారు. కార్యక్రమంలో కామారెడ్డి సబ్‌డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి ఆర్డీవో వీణ, తహశీల్దార్ జనార్దన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్అండ్బీ, ఫిషరీస్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.