అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Power Banks | విమానాల్లో ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు వస్తువులను అనుమతించరు. ముఖ్యంగా పేలుడు పదార్థాలను ప్రయాణికులు వెంట తీసుకు వెళ్లడానికి వీలు లేదు. తాజాగా డీజీసీఏ పవర్ బ్యాంక్‌లను సైతం నిషేధించడానికి సిద్ధం అవుతోంది.
దేశీయ విమాన ప్రయాణాల్లో పవర్‌బ్యాంక్‌ల వాడకంపై కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) యోచిస్తోంది. విమానాల్లో వీటిని పూర్తిగా నిషేధించాలని, లేదంటే కఠిన నిబంధనలు అమలు చేయాలని పరిశీలిస్తోంది. ఇటీవల ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో డీజీసీఏ సమాలోచనలు చేస్తోంది.
Power Banks | పేలిన పవర్ బ్యాంక్
ఢిల్లీ (Delhi) నుంచి దిమాపూర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం (Indigo Flight)లో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ ఇటీవల పేలింది. దీంతో మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. వారం క్రితం దక్షిణ కొరియాలోని సియోల్‌కు వెళ్తున్న ఎయిర్ చైనా (Air China) విమానంలో ఓ ప్రయాణికుడి లగేజీలోని లిథియం బ్యాటరీ పేలి మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
Power Banks | భద్రతా కారణాలతో..
భద్రతా కారణాలతో ఇప్పటికే పలు విమానాల్లో పవర్ బ్యాంక్‌లు, లిథియం బ్యాటరీల వినియోగంపై ఆంక్షలు అమలులో ఉన్నాయి. తాజాగా దేశీయ ప్రయాణాల్లో సైతం వీటిని నిషేధించాలని డీజీసీఏ యోచిస్తోంది. పవర్ బ్యాంక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడం లేదా వాటి సామర్థ్యంపై పరిమితులు విధించడం చేయాలని చూస్తోంది. వీటి మార్గదర్శకాలను రూపొందించడాని చర్యలు చేపట్టింది. కాగా అంతర్జాతీయ ఎయిర్ లైన్స్‌లో ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఎమిరేట్స్ విమానాల్లో పవర్ బ్యాంకుల వినియోగాన్ని నిషేధించింది. వంద వాట్-అవర్‌ల కంటే తక్కువ సామర్థ్యం ఉన్న వాటిని మాత్రమే ప్రయాణికులు వెంట తీసుకు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. అలాగే విమానంలో ఉన్న సమయంలో వాటిని వినియోగించకూడదని ఆదేశించింది.
