అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | ఎన్నికల్లో శాంతి భద్రతలను కాపాడడంలో ఎలాంటి రాజీ ఉండదని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ఎన్నికల ప్రక్రియను భంగపరచాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) నామినేషన్ల దృష్ట్యా గురువారం రామారెడ్డి మండలంలోని పోసానిపేట్, రామారెడ్డి గ్రామ పంచాయతీలు, మాచారెడ్డి పోలీస్ స్టేషన్ (Machareddy Police Station) పరిధిలోని మాచారెడ్డి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్, పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల్లో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడి, ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరిగేలా పనిచేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు పారదర్శకమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రతి సిబ్బందిపైన ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ (SP Rajesh Chandra) మాట్లాడుతూ.. జిల్లాలోని సెన్సిటివ్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ప్రతి పోలింగ్ కేంద్రంలో పకడ్బందీ బందోబస్తు, పెట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అక్రమ డబ్బు, మద్యం పంపిణీ, బెదిరింపులు, అనైతిక ప్రలోభాలు ఎక్కడైనా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్పీ వెంట కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy), ఎస్సైలు ఉన్నారు.