అక్షరటుడే, వెబ్డెస్క్ : CP Sajjanar | హైదరాబాద్ పోలీసులు చైనా మాంజాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజలతో పాటు పక్షుల ప్రాణాలు తీస్తున్న దీనిని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) హెచ్చరించారు.
సంక్రాంతి పండుగ (Sankranthi festival) వేళ నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలు, వాడకంపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు సీపీ స్పష్టం చేశారు. దీనిని రహస్యంగా విక్రయించినా, నిల్వ ఉంచినా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. చైనీస్ మాంజా (Chinese manja) నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి అధికారులకు సీపీ ఆదేశాలు జారీ చేశారు.
CP Sajjanar | చైనా మాంజాపై నిషేధం
పండుగ పూట గాలిపటాలు ఎగురవేయడం సంప్రదాయమే అయినప్పటికీ, అది ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదని సజ్జనార్ హితవు పలికారు. చైనా మాంజా పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తోందన్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ప్రకారం ప్రభుత్వం చైనీస్ మాంజా తయారీ, విక్రయం, నిల్వ, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించిందన్నారు. ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు నగరవ్యాప్తంగా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు.
CP Sajjanar | తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలి
తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. చైనీస్ మాంజాలో ప్లాస్టిక్, ఇతర సింథటిక్ పదార్థాలతో పాటు గాజు పెంకుల మిశ్రమం పూతగా ఉంటుందన్నారు. పిల్లలకు అలాంటి మాంజా కొనివ్వద్దన్నారు. దీంతో పిల్లల వేళ్లు కూడా తెగిపోయే ప్రమాదం ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంప్రదాయ దారాలను ఇవ్వాలని కోరారు.