అక్షరటుడే, ఎల్లారెడ్డి : China Manja | నిషేధిత చైనా మాంజాను విక్రయించినా.. కొనుగోలు చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డి సీఐ ఎల్లారెడ్డి (CI Ellareddy) హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం పతంగులు, మాంజా విక్రయ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. సంక్రాంతి పండుగ (Sankranti Festival) సందర్భంగా చైనా మాంజా ఎక్కడా విక్రయించకూడదన్నారు. గోడౌన్లు, మార్కెట్లపై అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
China Manja | ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలో..
ఎల్లారెడ్డి సర్కిల్ (Ellareddy Circle) పరిధిలో నిషేధించిన చైనామాంజా (సింథటిక్, నైలాన్ దారం) విక్రయాలు, వినియోగంపై సిబ్బంది నిఘా పెట్టాలని సీఐ ఆదేశించారు. నైలాన్, సింథటిక్ దారాలతో తయారైన ఈ చైనా మాంజా వాడడం వల్ల పక్షులు, పశువులు, సాధారణ ప్రజలు, బైక్పై వెళ్లే వారికి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గాలిపటాలు ఎగరేసే సమయంలో అనేక పక్షులు తీవ్రంగా గాయపడిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా.. ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించే అవకాశం ఉందని సీఐ తెలిపారు.