అక్షరటుడే, వెబ్డెస్క్ : CP Sajjanar | తల్లిదండ్రులను పట్టించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ (Hyderabad CP) సజ్జనార్ అన్నారు. వృద్ధాప్యంలో వారిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
తనను నిత్యం ఎంతో మంది వివిధ సమస్యలపై కలుస్తుంటారని చెప్పారు. వృద్ధాప్యంలో, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను సొంత బిడ్డలే అనాథలుగా వదిలేయడం అనేకసార్లు చూశానన్నారు. తనను ఈ విషయం ఎంతో బాధ పెట్టిందని సీపీ పేర్కొన్నారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. తల్లిదండ్రుల (Parents) బాగోగులు చూడటం బిడ్డల కనీస ధర్మం అన్నారు. ఈ విషయంలో ఎలాంటి సాకులకు, సమర్థనలకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు.
CP Sajjanar | పిల్లలకు పాఠం అవుతుంది
ఈ రోజు తల్లిదండ్రుల పట్ల మీరు ప్రవర్తించే తీరే.. రేపు మీ పిల్లలకు పాఠం అవుతుందన్నారు. నేడు మీరు ఏది విత్తుతారో.. వృద్ధాప్యంలో అదే కోసుకుంటారని చెప్పారు. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, హింసించినా ఉపేక్షించేది లేదన్నారు. కన్నవారిని రోడ్డున వదిలేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దిక్కుతోచని స్థితిలో, తమ గోడు ఎవరూ వినడంలేదని కుమిలిపోతున్న ప్రతి వృద్ధుడికి, ప్రతి తల్లికి పోలీసుశాఖ (Police Department) అండగా ఉంటుందన్నారు. బాధితులు నిర్భయంగా నేరుగా సంప్రదించాలని సూచించారు.
కాగా చాలామంది తమను కనిపెంచిన తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. వారి ఆస్తులు తీసుకుంటున్న పిల్లలు బాగోగులు మరిచిపోతున్నారు. వృద్ధుల సంరక్షణ చట్టాల గురించి అవగాహన లేక చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు వేధిస్తున్నా, ఇంట్లో నుంచి పంపించిన ఏమి అనడం లేదు. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ తల్లిదండ్రులకు పోలీస్ శాఖ అండగా ఉందని ప్రకటించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.