అక్షరటుడే, బాన్సువాడ: Banswada | మండలంలోని బోర్లం క్యాంప్ ఎస్సీ గురుకుల పాఠశాలలో (SC Gurukula School) విద్యార్థిని సంగీత అధికారుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ (Former MLA Yendala Lakshminarayana) ఆరోపించారు. గురుకుల పాఠశాల గేటు ఎదుట సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి బీజేపీ నేతలు, కార్యకర్తలు భైఠాయించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
పాఠశాల ఫర్నీచర్‌ను ఇంటికి తరలించి..
ఈ సందర్భంగా యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాఠశాలకు చెందిన ఫర్నీచర్‌ను అక్రమంగా తరలించడం, రాత్రివేళ విద్యార్థులతో కుర్చీలు మోయించడం నేరపూరిత చర్యలేనని స్పష్టం చేశారు. ఆటోనుంచి విద్యార్థినులు పడిపోతున్న దృశ్యాలు బయటపడినా, ఇప్పటివరకు బాధ్యులపై కఠిన చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. దోషులను కాపాడేందుకే దర్యాప్తును నీరుగారుస్తున్నారా.. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే పోలీసులు మౌనంగా ఉన్నారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రిన్సిపాల్‌ను తొలగించాల్సిందే..
ప్రిన్సిపాల్‌ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి, ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలని, విద్యార్థిని మృతికి బాధ్యులైన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ (Banswada) పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి, నస్రుల్లాబాద్ (Nasrullabad) మండల అధ్యక్షుడు హన్మాండ్లు యాదవ్, నాయకులు కొండని గంగారం, భూమేష్, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విద్యార్థిని కుటుంబానికి రూ. 50లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
బోర్లం క్యాంప్ (Borlam Camp) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థిని సంగీత కుటుంబానికి ప్రభుత్వం రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బాన్సువాడ బస్టాండ్ వద్ద సోమవారం బాన్సువాడ (Banswada)-బోధన్ రహదారిపై విద్యార్థి సంఘాలు, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలన్నారు. గురుకులాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ (PDSU) జిల్లా అధ్యక్షుడు నల్లజరి బాలరాజు, టీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మావురం శ్రీకాంత్, బీఆర్ఎస్వీ నాయకుడు సాయిబాబా, డీఎస్ఎఫ్ఐ జీవన్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు జుబేర్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
