అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అధికారులను హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల (Indiramma house construction work) తీరుపై తన ఛాంబర్లో సంబంధిత అధికారులు పీడీ హౌసింగ్, మెప్మా, మున్సిపల్ కమిషనర్, డీఈ, ఏఈలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇళ్లు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్లు కట్టివ్వాలనే లక్ష్యంతో అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma house scheme) అర్హులకు చేరాలన్నారు. లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించేందుకు అవసరమైన స్థల మార్కింగ్ పనులు తక్షణమే పూర్తి చేయాలని సూచించారు.
ఎంపీడీవో, ఎంపీవోలు తమ మండలాల్లో పర్యవేక్షిస్తూ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలన్నారు. ఇంజినీరింగ్ అధికారులు, గృహనిర్మాణ శాఖ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మార్క్ అవుట్ పనుల్లో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మార్క్ అవుట్లో పూర్తి చేసిన గ్రామాల వివరాలు ప్రతిరోజూ అప్‌డేట్ చేయాలన్నారు. వంద శాతం లక్ష్యాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా ప్రత్యేక మానిటరింగ్ బృందాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునే సమయంలో ఆర్థిక ఇబ్బందులు (financial difficulties) తలెత్తితే నిర్మాణానికి అవసరమైన నిధులను మహిళా సంఘాల ద్వారా రుణం రూపంలో లబ్ధిదారులకు అందించాలన్నారు.
తద్వారా లబ్ధిదారులు ఇళ్లు సమయానికి పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. జీపీ, వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల్లో పురోగతి తీసుకురావాలని సూచించారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ విజయపాల్ రెడ్డి, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.

