అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | ఎన్నికల్లో ఎవరైనా బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) హెచ్చరించారు.
ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. ఐకమత్యంగా ఉంటూ సమిష్టి నిర్ణయం ద్వారా సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. కానీ ఇందుకు భిన్నంగా డబ్బుల ప్రలోభాలు చూపి, భయభ్రాంతులకు గురిచేసి బలవంతంగా ఏకగ్రీవాలు చేయించే ప్రయత్నాలను ఉపేక్షించబోమన్నారు.
ఏకగ్రీవ ఎన్నిక అని నిర్ధారణ చేయడానికి ముందు “తప్పనిసరి ధ్రువీకరణ” విధానాన్ని అమలులోకి తెచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఏకగ్రీవాల వెనుక ఎలాంటి అంశాలు దాగి ఉన్నాయని పరిశీలించేందుకు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీలో మిగిలి ఉన్న ఏకైక అభ్యర్థితో పాటు పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థుల నుంచి లిఖితపూర్వకంగా డిక్లరేషన్ తీసుకోవడం జరుగుతుందన్నారు. తమను ఎవరూ బెదిరించలేదని, పోటీ నుంచి వైదొలిగిన వారు తానూ ఎవరినీ బలవంత పెట్టలేదన్నారు. మిగిలిన అభ్యర్థి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వాటిని జిల్లా ఎన్నికల అథారిటీ క్షుణ్ణంగా పరిశీలించి సమిష్టి నిర్ణయంతో ఏకగ్రీవం అయ్యిందని.. నిర్ధారణ చేసుకొని నో అబ్జెక్షన్ లెటర్ ఇస్తారని కలెక్టర్ తెలిపారు.