అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | చైనా మాంజాలు అమ్మినా, వాటిని వినియోగించినా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించబడుతుందని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
SP Rajesh Chandra | సంక్రాంతి సందర్భంగా..
జిల్లా పరిధిలో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా (Chinese manjha) విక్రయాలు, వినియోగంపై పూర్తిస్థాయిలో నిషేధం అమలు చేస్తున్నామన్నారు. రాబోయే సంక్రాంతి పండుగ (Sankranthi festival) సందర్భంగా చైనా మాంజా ఎక్కువగా విక్రయించే దుకాణాలు, గోడౌన్లు, మార్కెట్లపై అధికారులు ప్రత్యేక తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. నైలాన్, సింథటిక్ దారాలతో తయారయ్యే చైనా మాంజా పర్యావరణానికి తీవ్రమైన విపత్తుగా మారడంతో పాటు, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతుందన్నారు.
SP Rajesh Chandra | పశువులు.. పక్షులకు ప్రదానం..
చైనా మాంజాను ఉపయోగించి గాలిపటాలు ఎగురవేసే సమయంలో పక్షులు, పశువులు, సాధారణ ప్రజలతో పాటు ముఖ్యంగా బైక్‌లపై ప్రయాణించే వారు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారని ఎస్పీ తెలిపారు. గాలిపటాలు ఎగురవేసే వ్యక్తులు సైతం గాయపడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని ఘటనల్లో చైనా మాంజా ప్రాణాపాయ పరిస్థితులకు కూడా దారితీసిందన్నారు. నిషేధిత మాంజాను విక్రయించే దుకాణాలపై కేసులు నమోదు చేయడమే కాకుండా, సంబంధిత వ్యాపార లైసెన్సులను కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.
SP Rajesh Chandra | సాధారణ దారాన్నే వినియోగించాలి
ప్రజలు పర్యావరణానికి, ప్రాణాలకు హాని కలిగించని సాధారణ దారాన్ని మాత్రమే ఉపయోగించి గాలిపటాలు (flying kites) ఎగురవేయాలని సూచించారు. జిల్లా పరిధిలో ఎక్కడైనా చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉన్నట్లయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా, డయల్ 100, టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ సీఐ శ్రీనివాస్ 8712686112కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గత సంక్రాంతి పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో చైనామాంజా విక్రయానికి సంబంధించి పలు కేసులు నమోదు చేయగా రూ.1.52 లక్షల విలువైన చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.