అక్షరటుడే, వెబ్‌డెస్క్: Free Bus | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న “స్త్రీ శక్తి” పథకం (Stree Shakti Scheme) మహిళల నుంచి విస్తృత ఆదరణ పొందుతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,458 ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం పొందుతున్నారు.
ఆర్టీసీ అధికారులు (RTC Officers) వెల్లడించిన వివరాల ప్రకారం.. బస్సుల్లో మహిళల ప్రయాణాల శాతం గతంలో 40శాతం కాగా.. ఇప్పుడు అది 65 శాతానికి పెరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఈ పథకాన్ని అధికంగా వినియోగిస్తున్నారు. మహిళలు విద్య, ఉద్యోగం, వైద్యం, వ్యక్తిగత అవసరాల కోసం సులభంగా ప్రయాణిస్తున్నారు.
Free Bus | పలు డిమాండ్స్..
ప్రభుత్వం ఈ పథకం విజయవంతంగా కొనసాగేందుకు లైవ్ ట్రాకింగ్ సిస్టమ్ (Live Tracking System) ప్రారంభించడానికి సన్నద్ధమవుతోంది. ప్రాథమికంగా గుంటూరులో పైలట్ ప్రాజెక్ట్ మొదలవుతుందన్నారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. అయితే, పథకం వల్ల బస్సుల్లో రద్దీ తీవ్రంగా పెరిగింది. దీంతో పురుషులు, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు సీట్ల సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. కొన్ని పల్లెటూర్లకు పరిమిత సంఖ్యలో బస్సులే ఉండడంతో, మహిళల రద్దీ వల్ల ఇతరులు నిలబడి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సమీక్ష నిర్వహించారు.
బస్సుల్లో ఎవరూ ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. అవసరమైతే అదనపు బస్సు సర్వీసులు పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. పథకాన్ని సద్వినియోగం చేస్తున్న మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం మహిళల ప్రయాణాలను సులభతరం చేయడంలో ప్రభావవంతంగా ఉన్నప్పటికీ, సమతుల్యత కోసం ప్రభుత్వానికి కొన్ని వ్యూహాత్మక మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ప్రజల అభిప్రాయం. అయితే ఇటీవల ఈ ఫ్రీ బస్సుకు (Free Bus) సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం మనం చూస్తూ ఉన్నాం. కొందరు సీటు కోసం కొట్టుకోవడం, మరి కొందరు టైమ్ పాస్‌కి బస్సులలో ప్రయాణించడం వంటివి చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా అనేది చూడాల్సిందే.