అక్షరటుడే, ఇందూరు: Nizamabad Municipal | నిజామాబాద్ నగర పాలక సంస్థలో (Nizamabad Municipal Corporation) విచిత్రం వెలుగు చూసింది. ఎవరైనా పనిచేసి జీతం తీసుకుంటారు. ఇక్కడ మాత్రం చాలామంది విధులకు రాకుండానే హాజరు వేసుకుని కథ నడిపించేస్తున్నారు. శానిటరీ విభాగంలో పలువురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు డ్యూటీలు చేయకుండానే జీతాలు పొందుతున్నారు. నగరపాలక సంస్థకు లక్షల రూపాయలు గండి కొడుతున్నారు.
Nizamabad Municipal | ఏడాది కాలంగా..
నిజామాబాద్ నగర పాలక సంస్థలో పలు విభాగాల్లో సుమారు 1,200 మంది ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో ఓ ప్రజాప్రతినిధి భర్త ఒక ఏజెన్సీ ద్వారా సుమారు 200 మందిని స్వీపర్లు, డ్రైవర్లు, శానిటరీ విభాగంలో (sanitary department) పలు ఉద్యోగాలను ఇప్పించారని తెలిసింది. అయితే వీరికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది. కానీ, ఇందులో సగం మంది ఉద్యోగులు గతేడాది నుంచి విధులకు హాజరు కావడం లేదని సమాచారం. అయినా వారికి నెలనెలా జీతాలు అందుతున్నాయి.
Nizamabad Municipal | ఇతరులపై పనిభారం..
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో (outsourced employees) సుమారు వంద మందికి పైగా విధులకు హాజరు కావడంలేదని తెలిసింది. దీంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతోందని వాపోతున్నారు. ప్రతిరోజూ తాము గంట నుంచి రెండు గంటలు అదనంగా పనిచేయాల్సి వస్తుందని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే.. పని చేయకుండానే పలువురు ఏడాది కాలంగా జీతాలు పొందుతున్నారని స్పష్టమవుతోంది.
Nizamabad Municipal | నోటీసులు జారీ
సిబ్బంది విధులు నిర్వహించకుండానే జీతాలు పొందుతున్నారని నగరపాలక సంస్థ (municipal corporation) ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ విషయమై పలువురు ఉద్యోగులు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో కమిషనర్‌కు దిలీప్ కుమార్ ఇప్పటివరకు 50 మందికి నోటీసులిచ్చారు. అలాగే వీరి నియామకాన్ని చేపట్టిన ఏజెన్సీకి కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఏడాది కాలంగా విధులకు రాకున్నా.. ఏజెన్సీ నిర్వాహకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోకపోవడం కొసమెరుపు.