అక్షరటుడే, వెబ్‌డెస్క్: stone quarry explosion : పశ్చిమ బెంగాల్ West Bengal లో ఘోర ప్రమాదం సంభవించింది. బిర్భూమ్ Birbhum జిల్లాలోని ఒక రాతి క్వారీలో శుక్రవారం (సెప్టెంబరు 12) భారీ పేలుడు సంభవించింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఈ ఘటన నల్హతి పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పూర్ రాతి క్వారీ Bahadurpur stone quarry లో చోటుచేసుకుంది.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. కార్మికులు రాళ్లను తొలగిస్తుండగా పేలుడు సంభవించింది. దీంతో క్వారీలోని ఒక పెద్ద భాగం కూలిపోయింది.
కార్మికులు తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ సుమారు 10 – 12 మంది కార్మికులు ఉన్నారు.
ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా.. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. గాయాలతో బయటపడ్డ నలుగురిని పూర్‌హాట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.
శిథిలాల కింద ఇంకా కార్మికులు చిక్కుకున్నారా.. లేదా.. అని తెలుసుకోవడానికి పోలీసులు, రెస్క్యూ బృందాలు ఆపరేషన్ చేపట్టాయి.
పేలుడుకు గల కారణంపై దర్యాప్తు చేపట్టారు. క్వారీ భద్రతా నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుందా.. అని విచారణ కొనసాగిస్తున్నారు.
కార్మికుల బంధువులు పెద్ద మొత్తంలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. క్వారీలో పనిచేస్తున్న వారు రోజువారీ వేతనాలు పొందే వారని, ఎలాంటి సామాజిక భద్రత లేదని ఒకరు చెప్పారు.
ఆసుపత్రిని సందర్శించిన నల్హతి తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ సింగ్, ఈ ఘటన ఎలా జరిగిందో తనకు తెలియదని పేర్కొన్నారు.
ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే “పూర్తి బాధ్యత” వహించాలని డిమాండ్ చేశారు.
stone quarry explosion :
“బీర్భూమ్, బంకురా, పశ్చిమ్ బర్ధమాన్ ప్రాంతంలోని రాతి క్వారీలు పేలుడు పదార్థాల దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి.. ” అని ఓ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఈ ప్రాంతంలో జరిగిన రెండు పేలుళ్ల కేసులను ఇప్పటికే దర్యాప్తు చేస్తోందన్నారు.
NIA దర్యాప్తులో ఉన్న కేసులలో మొహమ్మద్ బజార్‌లో 81,000 జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్లను అధికారులు స్వాధీనం చేసుకున్న కేసు ఒకటి.
బంకురా జిల్లాలోని సాల్టోరా వద్ద బైక్‌పై పేలుడు పదార్థాలు తీసుకువెళ్తున్న వ్యక్తి పేలుడు సంభవించి మరణించిన కేసు మరోటి.