అక్షరటుడే, వెబ్‌డెస్క్: ENGvIND | మాంచెస్టర్ టెస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) మాంచెస్టర్ టెస్టులో శతకంతో గర్జించడంతో ఇప్పుడు ఇంగ్లండ్‌కి 311 పరుగుల ఆధిక్యం లభించింది. సుదీర్ఘ విరామం తర్వాత స్టోక్స్ టెస్టుల్లో సెంచరీ సాధించడం విశేషం.
మూడు సంవత్సరాల తర్వాత స్టోక్స్ టెస్టుల్లో శతకం నమోదు చేశాడు. తొలి సెషన్‌లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో (Mohammed Siraj bowling) బౌండరీ కొట్టి మూడు అంకెల స్కోరును అందుకున్నాడు. ఇది అతడి టెస్టు కెరీర్‌లో 14వ సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలోనే ఒకే టెస్టులో ఐదు వికెట్లు తీయడంతో పాటు శతకం సాధించిన నాలుగో ఇంగ్లండ్ ఆటగాడిగా స్టోక్స్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు టోనీ గ్రెగ్, ఇయాన్ బోథమ్ (5 సార్లు), గస్ అట్కిన్సన్‌లే ఈ ఘనత సాధించారు.
ENGvIND | కష్టాలలో భారత్..
ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో (Old Trafford ground) ధాటిగా ఆడిన స్టోక్స్, తన సెంచరీతో పాటు టెస్టుల్లో 7,000 పరుగుల క్లబ్‌లోకి చేరాడు. ఈ ఫీట్‌ను సాధించిన 13వ ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచాడు. అంతేకాక, టెస్టుల్లో 7,000 పరుగులు మరియు 200కి పైగా వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా ప్రత్యేకమైన స్థానం సంపాదించాడు. గ్యారీ సోబర్స్ (8,032 పరుగులు, 235 వికెట్లు), జాక్వెస్ కలిస్ (Jacques Kallis)(13,289 పరుగులు, 292 వికెట్లు) మాత్రమే గతంలో ఈ ఘనతను అందుకున్నారు. ఒకవైపు వికెట్స్ పడుతున్నా కూడా స్టోక్స్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 198 బంతుల్లో 141 పరుగులు చేయగా, ఇందులో 11 ఫోర్స్, 3 సిక్సర్స్ ఉన్నాయి.
ఇక స్టోక్స్‌తో పాటు డాసన్ (26), కార్సే( 47) పరుగులతో విలువైన భాగస్వామ్యం నమోదు చేశారు. ఇంగ్లండ్ జట్టు 669 పరుగులకు ఆలౌట్ కాగా, 311 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ (Yashasvi Jaiswal), సాయి సుదర్శన్ డకౌట్ అయ్యారు. రెండు వికెట్లు వోక్స్‌కి దక్కాయి. రెండు కీలక వికెట్లు కోల్పోయి భారత్ కష్టాలలో పడింది. మ్యాచ్ డ్రా చేయాలంటే ఎవరో ఒకరు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. లేదంటే ఈ మ్యాచ్ కూడా ఇంగ్లండ్ చేతిలోకి వెళ్లిపోవడం ఖాయం.