Homeబిజినెస్​Stock Market | భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Stock Market | భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic stock markets) దాదాపు రోజంతా లాభాలబాటలో సాగాయి.

గురువారం ఉదయం సెన్సెక్స్‌ 198 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా మొదట్లో ఒడిదుడుకులకు లోనై స్వల్ప నష్టాల్లోకి జారుకుంది. ఆ తర్వాత కోలుకుని ఇంట్రాడేలో గరిష్టంగా 913 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో ప్రారంభమై వెంటనే 78 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రాడే(Intraday)లో గరిష్టంగా 279 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్‌ 443 పాయింట్ల లాభంతో 81,442 వద్ద, నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో 24,750 వద్ద స్థిరపడ్డాయి.

బీఎస్‌ఈలో 2,257 కంపెనీలు లాభపడగా 1,725 స్టాక్స్‌ నష్టపోయాయి. 147 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 109 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 36 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీల మొత్తం విలువ గురువారం రూ.1.46 లక్షల కోట్లు పెరిగింది.

యూఎస్‌ డాలర్‌ బలహీనంగా మారడం, డాలర్‌ ఇండెక్స్‌ (Dollar index) కూడా ఒత్తిడికి గురవుతుండడం, అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలతో.. విదేశీ పెట్టుబడిదారులు భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. మన మార్కెట్లకు వాతావరణం కూడా అనుకూలంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి రుతుపవనాలు ముందుగానే రావడంతో పంటలు బాగుండి ద్రవ్యోల్బణం మరింత తగ్గే అవకాశాలున్నాయన్న అంచనాలతో మార్కెట్‌ సెంటిమెంట్‌ బలపడుతోంది. ఆర్‌బీఐ(RBI) వడ్డీ రేట్లను 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించవచ్చన్న అంచనాలతో మార్కెట్లు లాభాలతో కొనసాగాయి.

Stock Market | పీఎస్‌యూ బ్యాంక్స్‌ స్టాక్స్‌లో సెల్లాఫ్‌..

పీఎస్‌యూ బ్యాంక్స్‌ స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బీఎస్‌ఈ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.60 శాతం నష్టపోయింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(BOB), ఐవోబీ ఒక శాతానికిపైగా పడిపోగా.. మహారాష్ట్ర బ్యాంక్‌, కెనెరా బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌ షేర్లు కూడా గణనీయంగా తగ్గాయి. ఆటో, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌లు స్పల్ప నష్టాలతో ముగిశాయి. రియాలిటీ ఇండెక్స్‌ 1.79 శాతం పెరిగింది. హెల్త్‌కేర్‌ సూచీ 0.88 శాతం, ఐటీ 0.45 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌, మెటల్‌ ఇండెక్స్‌లు 0.42 శాతం చొప్పున పెరిగాయి. పవర్‌, ఇన్‌ఫ్రా, ఎనర్జీ, టెలికాం ఇండెక్స్‌లు లాభాలతో ముగిశాయి. స్మాల్‌ క్యాప్‌(Small cap) ఇండెక్స్‌ 0.65 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.55 శాతం, మిడ్‌ క్యాప్‌ 0.39 శాతం లాభపడ్డాయి.

Stock Market | Top gainers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 18 స్టాక్స్‌ లాభాలతో, 12 స్టాక్స్‌ నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్‌ 4.50 శాతం పెరగ్గా.. పవర్‌గ్రిడ్‌ 1.99 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌(ICICI Bank) 1.65 శాతం, రిలయన్స్‌ 1.37 శాతం, అదాని పోర్ట్స్‌ 1.35 శాతం లాభపడ్డాయి.

Stock Market | Top losers..

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌(Indusind bank) 1.41 శాతం నష్టపోయింది. యాక్సిస్‌ బ్యాంక్‌ 1.06 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 0.63 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.57 శాతం, మారుతి 0.34 శాతం నష్టాలతో ముగిశాయి.

Must Read
Related News