Homeబిజినెస్​Stock Market | స్టాక్‌ మార్కెట్లు రయ్‌రయ్‌.. ఆల్‌టైం హైకి చేరువలో సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market | స్టాక్‌ మార్కెట్లు రయ్‌రయ్‌.. ఆల్‌టైం హైకి చేరువలో సెన్సెక్స్‌, నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) పరుగులు తీస్తున్నాయి. వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిశాయి. ప్రధాన సూచీలు ఆల్‌టైం హైకి మరింత దగ్గరయ్యాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ(Nifty)లు ఒక శాతానికిపైగా లాభపడి తొమ్మిది నెలల గరిష్టాలకు చేరాయి. గురువారం ఉదయం 127 పాయింట్ల స్వల్ప లాభంతో సెన్సెక్స్‌(Sensex), 24 పాయింట్ల లాభంతో నిఫ్టీ ట్రేడింగ్‌ ప్రారంభించి పైపైకి ఎగబాకాయి. మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో అమ్మకాల ఒత్తిడితో ఒడిదుడుకులకు లోనయినా ఆ తర్వాత పుంజుకుని మరింత వేగంగా గరిష్టాలవైపు పయనించాయి. చివరికి ఇంట్రాడే గరిష్టాలకు చేరువలో సెన్సెక్స్‌ 1000 పాయింట్ల లాభంతో 83,755 వద్ద, నిఫ్టీ 304 పాయింట్ల లాభంతో 25,549 వద్ద స్థిరపడ్డాయి. ప్రస్తుతం ఆల్‌టైం హైకి సెన్సెక్స్‌ 2,223 పాయింట్ల దూరంలో ఉండగా.. నిఫ్టీ 728 పాయింట్ల దూరంలో నిలిచింది. బీఎస్‌ఈలో 2,097 కంపెనీలు లాభపడగా 1,900 స్టాక్స్‌ నష్టపోయాయి. 156 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 127 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 37 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 13 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీల సంపద రూ. 2.37 లక్షల కోట్లు పెరిగింది.

Stock Market | మార్కెట్లు పెరగడానికి కారణం..

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గడం, ఇరాన్‌తో అణు ఒప్పందానికి అవకాశం ఉందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటనలతో స్టాక్‌ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గడం భారత్‌(Bharath)కు సానుకూలాంశం. అలాగే యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ మూడేళ్ల కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో మన దేశంలోకి పెట్టుబడులు తరలివస్తాయని భావిస్తున్నారు. మరోవైపు రిటైల్‌ ఇన్వెస్టర్లతోపాటు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు అలుపన్నదే లేకుండా పెట్టుబడులతో మద్దతు ఇస్తుండడంతో మార్కెట్లు కొత్త రికార్డులవైపు పయనిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ(HDFC), ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ రెండు శాతానికిపైగా పెరగ్గా.. రిలయన్స్‌(Reliance) 1.90 శాతం పెరిగి సూచీలు పరుగులు తీయడంలో ప్రధాన పాత్ర పోషించాయి.

Stock Market | రాణించిన మెటల్‌, ఆయిల్‌ రంగాల షేర్లు..

రియాలిటీ, ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించాయి. బీఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌(Metal index) 2.28 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ 1.88 శాతం లాభపడ్డాయి. ఎనర్జీ ఇండెక్స్‌ 1.60 శాతం, కమోడిటీ 1.39 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 1.25 శాతం, పవర్‌ 1.13 శాతం, ఇన్‌ఫ్రా 1.10 శాతం, బ్యాంకెక్స్‌ 0.95 శాతం పెరిగాయి. రియాలిటీ ఇండెక్స్‌ 1.04 శాతం, ఐటీ ఇండెక్స్‌ 0.13 శాతం పడిపోయాయి. లార్జ్‌ క్యాప్‌(Large cap) ఇండెక్స్‌ 1.16 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.56 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.12 శాతం లాభాలతో ముగిశాయి.

Top gainers: బీఎస్‌ఈలో నమోదైన షేర్లలో జైబాలాజీ ఇండస్ట్రీస్‌(Jai Balaji Industries) 13.48 శాతం, లాయిడ్స్‌ ఇంజినీరింగ్‌ 9.03 శాతం, అపార్‌ ఇండస్ట్రీస్‌ 8.53 శాతం, వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 5.37 శాతం, ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ 5.13 శాతం పెరిగాయి.
Top losers: ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌(Infibeam Avenues) 6.6 శాతం, ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌ 5.13 శాతం, శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ 4.45 శాతం, ఓక్‌హార్డ్ట్‌ 3.97 శాతం, డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ 3.9 శాతం నష్టపోయాయి.

Must Read
Related News