అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) భారీగా పతనమైంది. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడితో కుదేలయ్యాయి. లార్జ్ క్యాప్ స్టాక్స్‌లోనూ ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. సెన్సెక్స్ 609 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 225 పాయింట్ల నష్టంతో ముగిశాయి.
యూఎస్ ఫెడ్ సమావేశ ఫలితం బుధవారం వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఎఫ్ఐఐల అమ్మకాలు నిరంతరాయంగా కొనసాగుతుండడం, రూపాయి విలువ బలహీనపడుతుండడం, చమురు ధరలు పెరుగుతుండడంతో రిటైల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింటోంది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితులతో తీవ్రంగా అమ్మకాలకు దిగుతుండడంతో స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా నష్టపోతున్నాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ 88 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. వెంటనే కోలుకుని 98 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేకపోయింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 847 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ (Nifty) 27 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 19 పాయింట్లు పెరిగినా.. అక్కడినుంచి 286 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 609 పాయింట్ల నష్టంతో 85,102 వద్ద, నిఫ్టీ 225 పాయింట్ల నష్టంతో 25,960 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వరుసగా ఐదో సెషన్లోనూ నష్టాలతో ముగిసింది.
అన్ని రంగాల్లో సెల్లాఫ్..
బీఎస్ఈలో అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. సర్వీసెస్ ఇండెక్స్ 3.70 శాతం, రియాలిటీ ఇండెక్స్ 3.50 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2.99 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 2.83 శాతం, టెలికాం 2.53 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ 2.26 శాతం, ఇండస్ట్రియల్ 2.21 శాతం, యుటిలిటీ 2.10 శాతం, మెటల్ 1.96 శాతం, కమోడిటీ 1.67 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.20 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.73 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 1.11 శాతం నష్టాలతో ముగిశాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 950 కంపెనీలు లాభపడగా 3,348 స్టాక్స్ నష్టపోయాయి. 187 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 88 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 527 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 12 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 5 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 7.51 లక్షలకోట్ల మేర ఆవిరయ్యింది.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 2 కంపెనీలు మాత్రమే లాభాలతో ముగియగా.. 27 కంపెనీలు నష్టపోయాయి. ఒకటి ఫ్లాట్‌గా ముగిసింది. టెక్ మహీంద్రా 1.40 శాతం, రిలయన్స్ 0.11 శాతం లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫ్లాట్‌గా ముగిసింది.
Top Losers : బీఈఎల్ 4.97 శాతం, ఎటర్నల్ 2.45 శాతం, ట్రెంట్ 2.35 శాతం, టాటా స్టీల్ 2.18 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.12 శాతం నష్టపోయాయి.