అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | యూఎస్ విధించిన సెకండరీ టారిఫ్‌ల(Secondary tariffs) అమలు గడువు సమీపిస్తున్నా ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చల విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. సుంకాల విషయంలో ట్రంప్ మరోసారి బెదిరింపులకు పాల్పడడంతో అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఇప్పట్లో తొలగేలా లేవు.
ఈ నేపథ్యంలో మదుపరులు ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. బ్యాంక్(Bank), ఫార్మా, మెటల్ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. దీంతో సూచీలు నష్టపోయాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 258 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 437 పాయింట్లు క్షీణించింది. 68 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty) అక్కడినుంచి 144 పాయింట్లు పడిపోయింది. ఆ తర్వాత కొంత కోలుకున్నా.. ద్వితీయార్థంలో మళ్లీ సూచీలు నేల చూపులు చూశాయి. చివరికి సెన్సెక్స్(Sensex) 849 పాయింట్ల నష్టంతో 80,786 వద్ద, నిఫ్టీ 255 పాయింట్ల నష్టంతో 24,712 వద్ద స్థిరపడ్డాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,220 కంపెనీలు లాభపడగా 2,891 స్టాక్స్ నష్టపోయాయి. 130 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 101 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 103 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల విలువ రూ. 6 లక్షల కోట్లమేర తగ్గింది.
ఎఫ్‌ఎంసీజీ మినహా..
ఎఫ్‌ఎంసీజీ సెక్టార్(FNCG sector) మినహా మిగిలిన అన్ని రంగాల స్టాక్స్ సెల్లాఫ్‌కు గురయ్యాయి. బీఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ సూచీ మాత్రమే 0.59 శాతం లాభంతో ముగిసింది. రియాలిటీ ఇండెక్స్ 2.24 శాతం, మెటల్(Metal) 2.10 శాతం, టెలికాం ఇండెక్స్ 2.04 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.92 శాతం, ఇన్‌ఫ్రా 1.80 శాతం, ఎనర్జీ 1.68 శాతం, యుటిలిటీ 1.61 శాతం, పవర్ 1.53 శాతం, కమోడిటీ 1.49 శాతం, క్యాపిటల్ గూడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్‌లు 1.48 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.68 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.34 శాతం, లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 1.11శాతం నష్టాలతో ముగిశాయి.
Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 5 కంపెనీలు లాభాలతో, 25 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. హెచ్‌యూఎల్ 2.35 శాతం, మారుతి 1.85 శాతం, ఐటీసీ 0.93 శాతం, టీసీఎస్ 0.49 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.19 శాతం లాభపడ్డాయి.
Top Losers : సన్‌ఫార్మా 3.40 శాతం, టాటా స్టీల్ 2.88 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.67 శాతం, ట్రెంట్ 2.45 శాతం, ఎంఅండ్‌ఎం 2.02 శాతం నష్టపోయాయి.
