Brazil | బ్రెజిల్‌ను ప్రకృతి వైపరీత్యాలు అతలాకుతలం చేస్తున్నాయి. తుపాన్లు, భారీ వర్షాలు, అత్యంత బలమైన ఈదురుగాలులతో దేశ దక్షిణ ప్రాంతం వణికిపోతోంది. ముఖ్యంగా రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో పరిస్థితి అంచనాలకు మించి తీవ్రంగా మారింది.
అతి అధిక ఉష్ణోగ్రతలు, శీతల వాయువుల కలయికతో ఈ తుఫాను ఏర్పడినట్లు బ్రెజిల్ వాతావరణ శాఖ (Brazilian Meteorological Department) వెల్లడించింది.సోమవారం మధ్యాహ్నం నుంచి రియో గ్రాండే డో సుల్ అంతటా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. రాష్ట్ర రాజధాని గుయిబా నగరంలో భారీ తుఫాను సంభవించగా, గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల తీవ్రతకు నగరంలోని హవాన్ మెగాస్టోర్ వెలుపల ఏర్పాటు చేసిన 79 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ (Statue of Liberty) కుప్పకూలింది.
Brazil | కూలిన కట్టడం..
నెమ్మదిగా ముందుకు వంగుతూ ఖాళీ పార్కింగ్ స్థలంలో పడిపోయిన ఈ విగ్రహానికి సంబంధించిన దృశ్యాలు వీడియోల రూపంలో రికార్డై సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. డిఫెసా సివిల్ (బ్రెజిల్ పౌర రక్షణ సంస్థ) ప్రకారం, మెట్రోపాలిటన్ ప్రాంతమంతటా తీవ్ర వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత రాష్ట్రం కావడంతో ఈదురుగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. 2020లో ప్రతిష్ఠించిన ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 11 మీటర్ల ఎత్తు ఉన్న కాంక్రీట్ పునాదిపై నిర్మించబడింది. విగ్రహం కూలిపోయినప్పటికీ పునాది చెక్కుచెదరకుండా ఉండడం గమనార్హం. ఘటన సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ముందస్తుగా హవాన్ మెగాస్టోర్ సిబ్బంది వాహనాలను అక్కడి నుంచి తరలించడంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదు.
ఇదిలా ఉండగా, టియో హ్యూగో నగరంలో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. లాజెడో పట్టణంలో వరదలు సంభవించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బలమైన గాలులు, ప్రమాదకర నిర్మాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని డిఫెసా సివిల్ ప్రజలను హెచ్చరించింది. సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ ద్వారా మొబైల్ ఫోన్ల (Mobile Phones)కు అత్యవసర హెచ్చరికలు పంపిస్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.