అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు (High Court) స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు జారీ చేస్తూ.. ప్రభుత్వం జీవో నంబర్ 9 జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ జీవోపై స్టే విధించింది. దీంతో పాటు ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా స్టే విధిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ క్రమంలో ఎలాగైనా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. హైకోర్టు జీవోపై స్టే విధించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది.
BC Reservations | అనుమతి ఇవ్వాలని..
బీసీ రిజర్వేషన్లపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ప్రభుత్వం స్టడీ చేసింది. హైకోర్టు నిర్ణయంపై సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తోంది. ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని సీనియర్ కౌన్సిల్‌తో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో పాటు, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కావడంతో హైకోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని ప్రభుత్వం వాదించనున్నట్లు సమాచారం.
కాగా రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడంతో చాలా మంది ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో పోటీకి పలువురు ప్రయత్నాలు చేసుకుంటుండగా.. హై కోర్టు స్టే విధించింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందోనని ఆశావహులు, ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.