అక్షరటుడే, వెబ్‌డెస్క్: Supreme Court | రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. రంగారెడ్డి జిల్లా (Ranga Reddy district) సాహెబ్‌నగర్ కలాన్ గ్రామం గుర్రంగూడ అటవీ భూమి ప్రభుత్వానికి చెందుతుందని స్పష్టం చేసింది.
రంగారెడ్డి జిల్లాలోని సాహెబ్‌నగర్ కలాన్ గ్రామ పరిధిలో ఉన్న గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌కు (Gurramguda Reserve Forest) సంబంధించి సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని కోర్టు సమర్థించిందని, గతంలో ఇచ్చిన ప్రతికూల ఉత్తర్వులను రద్దు చేసిందని రంగారెడ్డి జిల్లా అటవీ అధికారి (Ranga Reddy District Forest Officer) (డీఎఫ్ఓ) రోహిత్ గోపిడి తెలిపారు. మూడు రోజుల విచారణ అనంతరం సర్వే నెం. 201/1లోని సుమారు 102 ఎకరాల భూమి గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో భాగమని, అది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అటవీ భూమి అని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది. నోటిఫై చేయబడిన అటవీ భూములపై విపరీతమైన జాప్యం తర్వాత ప్రైవేట్ యాజమాన్యం పేరుతో దాఖలు చేసిన క్లెయిమ్‌లు చట్టబద్ధంగా చెల్లుబాటు కావని స్పష్టం చేసింది.
Supreme Court | జాతీయ సంపద
అటవీ భూములు (forest lands) జాతీయ సంపద అని కోర్టు పేర్కొంది. అడవులను రక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని నొక్కి చెప్పింది. అటవీ శాఖ తీసుకున్న చర్యలు అటవీ చట్టాలు, పర్యావరణ పరిరక్షణ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయని కూడా కోర్టు పేర్కొంది. కాగా సదరు భూమి విలువ రూ.15 వేల కోట్లుగా ఉంటుందని అంచనా. రాష్ట్రం తరఫున వాదనలను వినిపించినందుకు సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్, జస్టిస్ (రిటైర్డ్) చల్లా కోదండరామ్, అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, అడ్వకేట్-ఆన్-రికార్డ్ కర్ణం శ్రవణ్ కుమార్‌లకు అటవీ శాఖ కృతజ్ఞతలు తెలిపింది.