అక్షరటుడే, వెబ్‌డెస్క్: Republic Day | సికింద్రాబాద్ (Secunderabad)లోని పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
గవర్నర్ (Governor Jishnu Dev Varma) మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం ఏర్పాటు అయిన ప్రజా ప్రభుత్వం అద్భుతమైన మైలురాళ్లను సాధించి, ప్రజల విశ్వాసాన్ని, ప్రశంసలను పొందిందన్నారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ డాక్యుమెంట్ ఆవిష్కరించడం ద్వారా దూరదృష్టితో అడుగు వేసిందని పేర్కొన్నారు. సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి కోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని తెలిపారు. వికసిత భారత్ 2047 నాటికి భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం (Central Government) సంకల్పించిందన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఒక ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుందని పేర్కొన్నారు.
Republic Day | మేడారం జాతర ఏర్పాట్లపై..
తెలంగాణ రైజింగ్ – 2047లో భాగంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టనుందని గవర్నర్ తెలిపారు. బాపు ఘాట్‌లో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, డ్రై పోర్టులు, రెండో దశ మెట్రో రైలు, ఔటర్, రీజినల్ రింగ్ రోడ్ల మధ్య రేడియల్ రోడ్లు, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. తెలంగాణ (Telangana) చరిత్రలో మొదటిసారిగా మేడారం గిరిజన గ్రామంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించారన్నారు. గతంలో చేసిన తాత్కాలిక ఏర్పాట్లకు భిన్నంగా, ప్రస్తుతం ప్రభుత్వం జాతరకు భారీగా ఏర్పాట్లు చేసిందన్నారు. శాశ్వత మౌలిక సదుపాయాల కోసం రూ.251 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు.
Republic Day | డ్రగ్స్ నియంత్రణకు చర్యలు
డ్రగ్స్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నట్లు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ తెలిపారు. మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (EAGLE) నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. సంక్షేమ పథకాలను విస్తరించడం, వ్యవసాయ సహాయాన్ని బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు.