Homeక్రీడలుMitchell Starc | స్టార్క్ విధ్వంసం.. 15 బంతుల్లో 5 వికెట్లు.. హిస్ట‌రీ క్రియేట్​ చేసిన...

Mitchell Starc | స్టార్క్ విధ్వంసం.. 15 బంతుల్లో 5 వికెట్లు.. హిస్ట‌రీ క్రియేట్​ చేసిన ఆసీస్ బౌల‌ర్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mitchell Starc | ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ప‌దునైన బంతులతో ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్‌మెన్స్‌ను ఎంతగా భ‌య‌పెడ‌తాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న తాజాగా తన 100వ టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. కింగ్స్‌టన్ సబీనా పార్క్‌(Kingston Sabina Park)లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్క్ రెండో ఇన్నింగ్స్‌లో కేవ‌లం 15 బంతుల్లోనే 5 వికెట్స్ తీశాడు. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్ర‌లో అత్యంత వేగంగా ఐదు వికెట్లు తీసిన బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు.

Mitchell Starc | సరికొత్త చ‌రిత్ర‌..

స్టార్క్ ఈ మైలురాయితో 78 ఏళ్ల పురాతన రికార్డును బద్దలు కొట్టాడు. అంతకుముందు ఎర్నీ టోషాక్ (1947లో భారత్‌పై), స్టువర్ట్ బ్రాడ్ (2015లో ఆస్ట్రేలియాపై), స్కాట్ బోలాండ్ (2021లో ఇంగ్లాండ్‌పై) 19 బంతుల్లో ఐదు వికెట్లు తీశారు. కానీ స్టార్క్ (Mitchell Starc) 15 బంతుల్లోనే సాధించాడు. స్టార్క్ తన మొదటి ఓవర్‌లోనే తొలి బంతికే ఓపెనర్‌ను అవుట్ చేశాడు. దీంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్‌ మొదటి నుంచే ఒత్తిడిలో పడిపోయింది.

స్టార్క్ దూకుడుగా బౌలింగ్ చేస్తూ వరుసగా వికెట్లు తీస్తూ కొత్త రికార్డు సృష్టించాడు. ఈ చారిత్రాత్మక ప్రదర్శనలో స్టార్క్ తన టెస్ట్ కెరీర్‌లో 400 వికెట్లు కూడా పూర్తిచేశాడు. ఈ ఘనతను సాధించిన నాలుగో ఆస్ట్రేలియన్ బౌలర్‌గా నిలిచాడు. ఫాస్ట్ బౌలర్లలో గ్లెన్ మెక్‌గ్రాత్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆస్ట్రేలియన్ పేసర్ స్టార్కే(Australian Pacer Starcke).

స్టార్క్ అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియా విజయం సాధించడమే కాకుండా, టెస్ట్ క్రికెట్(Test Cricket) చరిత్రలోనే రెండవ అత్యల్ప స్కోరు( 27 ప‌రుగులు) నమోదు చేసింది. ఈ ప్రదర్శన ఆటగాడిగా స్టార్క్‌ కెరీర్‌కు గర్వకారణం కావడమే కాకుండా, క్రికెట్ చరిత్రలో ఓ చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుంది.

ఈ టెస్టులో 204 పరుగుల లక్ష్యఛేదనతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ జ‌ట్టు కేవ‌లం 27 పరుగులకే కుప్పకూల‌డం విశేషం. ఈ మ్యాచ్‌లో స్టార్క్ మొత్తం 6 వికెట్లు తీశాడు. ఇక‌ స్కాట్ బోలాండ్ హ్యాట్రిక్ సాధించాడు. ఆసీస్ బౌలర్ల ధాటికి వెస్టిండీస్ జ‌ట్టు(West Indies Team)లో ఏడుగురు బ్యాట్స్ మెన్ డకౌట్ అయ్యారు. జస్టిన్ గ్రీవ్స్ చేసిన 11 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోరుగా న‌మోదైంది.