అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tamil Nadu Stampede | తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సినీ నటుడు, టీవీకే (TVK) పార్టీ అధినేత విజయ్ సమావేశంలో శనివారం రాత్రి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు.
కొత్తగా తమిళగ వెట్రి కజగం పార్టీ పెట్టిన విజయ్ (Vijay) అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని గతంలో ప్రకటించారు. ఈ మేరకు పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆయన పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఆయన కరూర్ (Karur)లో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. దీనికి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటలో పది మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. 22 మంది కరూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 10 మంది పరిస్థితి విషమం ఉన్నట్లు సమాచారం.
Tamil Nadu Stampede | భారీగా ప్రజలు రావడంతో..
ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలి రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్టీ కార్యకర్తలు, పలువురు చిన్నారులు ఈ ఘటనలో గాయపడ్డారు. దీంతో విజయ్ తన ప్రసంగాన్ని ఆపి, ప్రశాంతంగా ఉండాలని కోరారు. అనంతరం బాధితులను అంబులెన్స్‌ల్లో ఆస్పత్రులకు తరలించారు. గందరగోళం సమయంలో, తొమ్మిదేళ్ల బాలిక తప్పిపోయినట్లు సమాచారం. ముగ్గురు చిన్నారులు కూడా గాయపడ్డారు.
Tamil Nadu Stampede | స్పందించిన సీఎం
కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ (CM Stalin) స్పందించారు. ఆయన జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. ఘటనా స్థలానికి చేరుకుని వైద్య సహాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏడీజీపీ (శాంతిభద్రతలు) డేవిడ్సన్ కూడా ఘటనా స్థలానికి వెళ్లారు. ఆరోగ్య మంత్రి, పాఠశాల విద్యా మంత్రిని కరూర్‌కు వెళ్లాలని సీఎం ఆదేశించారు.