అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శనం చేసుకుంటారు. గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండి స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ (TTD) పలు కీలక సంస్కారణాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఏఐ టెక్నాలజీ (AI Technology)తో తిరుమలలో భక్తులకు రెండు గంటల్లో దర్శనం అయ్యేలా చేపట్టడానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయంపై టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం బ్రేక్ దర్శన సమయంలో ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాన్య భక్తులకు రెండు, మూడు గంటల్లో దర్శనం అసాధ్యమన్నారు. ఏఐ టెక్నాలజీతో వేగవంతంగా దర్శనం కల్పించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఏఐ పేరిట టీటీడీ ధనాన్ని వృథా చేయడం సరికాదని ఆయన అభిప్రాయ పడ్డారు. ఆయన వ్యాఖ్యలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) ఖండించారు.
Tirumala | గూగుల్, టీసీఎస్ సహకారంతో..
తిరుమలలో శ్రీవారి క్యూ లైన్లలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఏఐ టెక్నాలజీని వినియోగించి వేగవంతంగా దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించినట్లు ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. గూగుల్ (Google), టీసీఎస్ (TCS) లాంటి సంస్థల సహకారంతో ఉచితంగా దీనిని అమలు చేయాలని పాలక మండలి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిర్దేశించిన సమయానికి కల్పించేందుకు, దర్శనం సమయాన్ని భక్తులకు ముందస్తుగా తెలియజేయడానికి మాత్రమే ఏఐ విధానాన్ని అమలు చేస్తామన్నారు. దీంతో భక్తులు ఎక్కువ సమయం కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం ఉండదన్నారు.
Tirumala | ఆయన వ్యాఖ్యలు బాధాకరం
విశ్రాంత ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా వ్యాఖలు చేయడం బాధాకరమని టీటీడీ ఛైర్మన్ అన్నారు. తిరుమలలో ఏఐ టెక్నాలజీ నిరుపయోగమని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ఇలాంటి మాటలు భక్తుల్లో గందరగోళం సృష్టిస్తాయని పేర్కొన్నారు. దాతల సాయంతో ఉచితంగా చేస్తున్న పనిని కూడా వృథా అనడం ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచమంతా ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తుంటే.. టీటీడీ వాడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.