అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరాంసాగర్ (SRSP)కు ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు వదర గేట్ల ద్వారా నీటి విడుదలను ఆపేశారు. బుధవారం 26 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల చేసిన అధికారులు గురువారం అన్ని గేట్లను మూసి వేశారు.
ఎస్సారెస్పీలోకి ప్రస్తుతం 1.20 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1089.40(74.72టీఎంసీలు) అడుగుల నీరు ఉంది. వరద గేట్ల ద్వారా గోదావరి (Godavari)లోకి నీటి విడుదల నిలిపివేయడంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
Sriram Sagar | కాలువల ద్వారా నీటి విడుదల
శ్రీరాంసాగర్ వరద గేట్లను మూసివేసిన అధికారులు కాల్వల ద్వారా మాత్రం నీటి విడుదల కొనసాగిస్తున్నారు. కాకతీయ కాలువ (Kakatiya Canal) ద్వారా 5 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3 వేలు, లక్ష్మి కాలువ ద్వారా 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. వరద కాలువ (Flood Canal) ద్వారా 20 వేల క్యూసెక్కులు మిడ్ మానేరుకు తరలిస్తున్నారు. ఎస్సారెస్పీ నుంచి మొత్తంగా 29,032 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదు అవుతోంది.
వరద కాలువ, గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్మానేరు (Mid Manair)కు ఇన్ఫ్లో వస్తుండటంతో జలాశయం నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్థిస్థాయి నీటిమట్టం 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15 టీఎంసీలకు చేరింది. ఎస్సారెస్పీకి ఎగువ నుంచి ప్రవాహం పెరిగితే మళ్లీ గేట్లు ఎత్తుతామని అధికారులు తెలిపారు. గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు ఏఈఈ కొత్త రవి సూచించారు. నదిలో చేపట వేటకు వెళ్లొద్దని సూచించారు.