అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌కు (SRSP) ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. నిజాంసాగర్ (Nizam Sagar) గేట్లు ఎత్తడంతో మంజీర ఉప్పొంగి పారుతోంది. మంజీర (Manjira)తో పాటు గోదావరికి వరద పోటెత్తడంతో శ్రీరామ్‌సాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది.
ఎస్సారెస్పీకి ప్రస్తుతం 1.65 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 26 వరద గేట్ల ద్వారా 1,02,850 క్యూసెక్కులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. కాల్వలు, వరద గేట్ల ద్వారా మొత్తం 1,31,717 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదవుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1087.2 అడుగుల (67.05 టీఎంసీలు) నీరు ఉంది.
Sriram Sagar | వరద కాలువ ద్వారా..
శ్రీరామ్‌సాగర్‌కు ఎగువ నుంచి భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో వరద కాలువ ద్వారా మిడ్‌మానేరు (Mid Maneru)కు నీటిని తరలిస్తున్నారు. మంగళవారం 18 వేల క్యూసెక్కులు వరద కాలువకు విడుదల చేసిన అధికారులు.. బుధవారం 20 వేల క్యూసెక్కులకు పెంచారు. దీంతో సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌మానేరు ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. మరోవైపు ఎస్సారెస్పీ కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా మూడు వేలు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు.
Sriram Sagar | పర్యాటకుల సందడి
శ్రీరామ్‌సాగర్ గేట్లు ఎత్తడంతో పర్యాటకులు (Tourists) తరలివస్తున్నారు. గోదావరి (Godavari) జల సవ్వడులు చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వస్తున్నారు. అయితే భద్రతా కారణాలతో అధికారులు పర్యాటకులను వరద గేట్లవైపు వెళ్లడానికి అనుమతించడం లేదు. దీంతో ఆనకట్టపై నుంచి జలాశయం అందాలను తిలకించి ప్రజలు వెనుదిరుగుతున్నారు. ప్రాజెక్ట్ దిగువన గల నెహ్రూ పార్క్‌లో సందడి చేస్తున్నారు. అయితే సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు.